నోట్లను రద్దు చేసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ… నల్లధన నిర్మూలన కోసమేనని పదే పదే చెప్పారు. తన లక్ష్యాల్లో అదే మొదటిది అన్నట్లుగా చెప్పారు. ఎన్నికల ప్రచారంలో కూడా…కొన్ని లక్షల కోట్ల అక్రమధనం.. భారతీయ అక్రమార్కులు విదేశాల్లో దాచారని..వాటిని తెచ్చి పేదలకు పంచుతామని చెప్పారు. ఒక్కో ఖాతాకు రూ. 15 లక్షలు వస్తాయని కూడా చెప్పారు. దానికి తగ్గట్లుగా మరి నోట్ల రద్దు వల్ల నల్లధనం బయటకు వచ్చిందా..?
స్విస్ బ్యాంకుల్లో పెరిగిన భారతీయుల డిపాజిట్లు..!
నల్లధనం తెస్తామన్నారు కదా… ఇంకా తేలేదేమిటి అంటే.. ఎన్నికల సమయంలో ఎన్నెన్నో చెబుతాం.. అవన్నీ చేస్తామా ఏమిటి..? అని నేరుగానే చెప్పేశారు. అమిత్ షా చాలా నిజాయితీగా చెప్పారు. దానికి గణాంకాలు కూడా ఉన్నాయి. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు.. 2015లో యాభై శాతం తగ్గాయి. 2016లో నలభై ఐదు శాతం తగ్గాయి. 2017లో మాత్రం యాభై శాతం పెరిగాయి. ఒక్క ఏడాదిలో ఇంత స్వింగ్ రావడానికి కారణం ఏమిటి..? భారతదేశంలో ఒక్కసారిగా ఇంత సంపద పెరిగిందా..? .బాగా సంపాదించుకున్న వాళ్లు ఒక్కసారిగా స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నారా..? అంటే.. ఏదీ కాదు. ఈ మధ్యకాలంలో జరిగింది.. నోట్ల రద్దు. అంటే.. నోట్ల రద్దు జరిగిన తర్వాత స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు గణనీయంగా పెరిగాయన్నది.. రికార్డులు నిరూపిస్తున్నాయి. దీనికే కేంద్రం.. అంతా నల్లధనం కాకపోవచ్చని చెబుతోంది. అది కరెక్టే కానీ.. ఒక్కసారే ఎందుకు పెరిగాయన్న అంశంపై వివరణ ఇవ్వాల్సి ఉంది. అంతకు ముందు ఏడాది యాభై శాతం స్విస్ బ్యాంక్ డిపాజిట్లు తగ్గితే..తర్వాత ఏడాది యాభై శాతం పెరిగాయంటే..కచ్చితంగా తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదు కదా..!
నోట్ల రద్దు వల్ల బ్లాక్మనీ బయటకు రాలేదు..!
సుప్రీంకోర్టు నల్లధనంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసింది.ఈ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గాయి. కానీ 2017లో పెరగడం ప్రారంభించాయి. నోట్ల రద్దు చేసినప్పుడు..అరుణ్ జైట్లీ చేసిన అధికారిక ప్రకటనలో నల్లకుబేరుల జాబితాలో చాలా మంది కాంగ్రెస్ నేతల పేర్లున్నాయి. అందుకే వారు నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. మరి ఎందుకు వారి పేర్లు బయటపెట్టడం లేదు..?. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన లెక్కల ప్రకారం… రూ. 15.44 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లను రద్దు చేశారు. ఆ రోజుకు భారతదేశంలో ఉన్న సర్క్యులేషన్ లో ఉన్న 85 శాతం నోట్లు రద్దు చేశారు. ఆ సొమ్మునంతా ప్రజలు.. డిపాజిట్ చేసుకోవడమో..మార్చుకోవడమో చేశారు. కానీ ఇల్లీగల్ మనీ మాత్రం బయటకు రాలేదు.
రూ. 3 లక్షల కోట్ల బ్లాక్మనీ ఏమైంది..?
నోట్ల రద్దు వల్ల లెక్కల్లో రాని నగదును.. నోట్ల రూపంలో దాచుకున్నవారు దొరికిపోతారని.. ప్రభుత్వం చెప్పింది. ఈ మొత్తం ఎంత ఉండవచ్చు..అనేదానిపై చిన్న లాజిక్ చెప్పింది. బ్యాంకులకు రానిది నల్లధనం. వచ్చినదంతా సక్రమమైనధనం. నోట్ల రద్దు విషయంలో సుప్రీంకోర్టుకు కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ లో రూ. మూడు లక్షల కోట్లు బ్యాంకులకు వెనక్కి రాకపోతే… ఆ సొమ్ము మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ముద్రించి.. కేంద్రానికి ఇస్తుందని చెప్పారు. ఆ మొత్తంతో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పుకొచ్చారు. అంటే.. రూ. 3 లక్షల కోట్లు నల్లధనం వెనక్కిరాదని చెప్పుకొచ్చారు. కానీ రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం.. వెనక్కి రాని.. నోట్లు రూ. 16వేల కోట్లు మాత్రమే. ఆర్బీఐ లెక్కల ప్రకారం.. ఒక్క శాతమే బ్లాక్ మనీ అయినట్లు లెక్క. ఒక్క శాతమే బ్లాక్ మనీ ఉందంటే ఎవరైనా నమ్ముతారా..? బ్లాక్ మనీ అంతా ఏమైంది..?
సేఫ్గా బ్యాంకుల్లోకి చేరిన బ్లాక్మనీ..!
అంటే బ్లాక్ మనీ కూడా.. బ్యాంకుల్లోకి వచ్చి వైట్ మనీగా మారిపోయింది. కొంత మంది.. ఇలా మార్చుకుని.. విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్లుగా చేరిస్తే..మరికొంత మంది ఇండియన్ బ్యాంకుల్లోనే వివిద మార్గాల ద్వారా డిపాజిట్ చేశారు. దీని ద్వారా తేలిందేమిటంటే.. నోట్ల రద్దు వల్ల బ్లాక్ మనీ మొత్తం వైట్ గా మారిపోయింది. బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం వైట్ మనీ కాదని.. ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ ఇంత వరకూ.. నల్లధనం డిపాజిట్ చేసిన వారిని ఒక్కరినీ గుర్తించలేదు. అలాంటి ప్రయత్నాలు జరిగినట్లు కూడా ఎక్కడా చెప్పలేదు. జిల్లా సహకార బ్యాంకుల్లోనూ..నోట్ల రద్దు తర్వాత డిపాజిట్లు తీసుకున్నారు. ఐదు రోజుల పాటు తీసుకుని ఆ తర్వాత నిలిపివేశారు. ఎందుకంటే.. బ్లాక్ మనీ.. ఆ బ్యాంకుల ద్వారా చెలామణిలోకి వస్తుందన్న కారణంతో ఆ పని చేశారు. .. ఆ ఐదు రోజుల్లో ఆ బ్యాంకుల్లో ఎంత వచ్చాయో పరిశీలన చేయలేదు.
మోడీ,షాలకు లింకులున్న బ్యాంకుల్లో వందల కోట్ల డిపాజిట్లు..!
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంక్ లో ఐదు రోజుల్లో ఏకంగా రూ. 745 కోట్ల విలువైన రద్దయిన నోట్లు జమయ్యాయి. ఆ బ్యాంక్ టోటల్ టర్నోవర్ రూ. 5వేల కోట్లు. ఏడాది లాభం రూ. 14కోట్లు. అలాగే రాజ్కోట్ డీసీసీబీలో రూ 693 కోట్లు జమ అయ్యాయి. అహ్మదాబాద్ డీసీసీబీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్టర్. ఒకప్పుడు ఆయన దీనికి చైర్మన్ గా కూడా ఉన్నారు. రాజ్ కోట్ డీసీసీబీకి.. గుజరాత్ కేబినెట్ మినిస్టర్ ఇప్పటికీ చైర్మన్ గాఉన్నారు. దేశంలో మరే డీసీసీబీలోనూ.. ఇంత భారీ మొత్తంలో పెద్ద నోట్లు జమ కాలేదు. ఈ రెండు బ్యాంకుల్లోనే ఎందుకు ఇంత పెద్దమొత్తంలో జమ అయ్యాయి.
క్యాష్ లెస్ కాదు..ఫుల్ క్యాష్…!
దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముందు ఉన్న కరెన్సీ కన్నా, అత్యధికంగా దానికి రెండు రెట్లకు పైగా డబ్బు ప్రజల వద్ద ప్రస్తుతమున్నదని రిజర్వు బ్యాంకు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అప్పటికి ప్రజలవద్ద రూ.7.8 లక్షల కోట్లు కన్నా తక్కువ డబ్బు మాత్రమే ఉంది. ఇప్పుడు దానికి రెండింతలు పైగా అంటే దాదాపు రూ.18.5 లక్షల కోట్లు కరెన్సీ ఉన్నట్లు ఆర్బిఐ డేటా వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు కారణంగా, బ్యాంకుల నుండి డబ్బు తీసుకోవడానికి అనేక పరిమితుల ఉండడంతో పెద్ద మొత్తంలో ప్రజల వద్ద నగదు నిల్వలు పేరుకుపోయాయి. క్యాష్ లెస్… కూడా..నోట్ల రద్దు లక్ష్యాల్లో ఒకటి. మరి ఎందుకు విఫలమయ్యారు.
బ్యాంకుల నిరర్థక ఆస్తుల పెరుగుదల..!
2018 మార్చి నాటికి భారతీయ బ్యాంకుల మొండి బాకీలు రూ. 10 లక్షల కోట్లు దాటాయి. మొండి బాకీలు అంటే… నాన్ పెర్మార్మింగ్ అసెట్స్. రూ.10 లక్షల కోట్ల మొండిబాకీలు అంటే.. బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల్లో 11.2 శాతం. అంటే బ్యాంకులు అప్పు ఇచ్చే ప్రతి వంద రూపాయాల్లో పదకొండు రూపాయలు తిరిగి రావడం లేదు. ఈ మొండి బాకీలు..మార్చి 2017 నాటికి రూ. 8 లక్షల కోట్లు. పైకి… రెండు లక్షల కోట్లు మొండిబాకీలుగా కనిపిస్తున్నాయి. నిజానికి సామాన్యుడు ఎవరైనా ఒకసారి బ్యాంకులో లోన్ తీసుకుని కట్టలేకపోతే.. మరోసారి బ్యాంకుల లోన్లు ఇవ్వవు. కానీ కార్పొరేట్ గద్దలకు మాత్రం .. ఎగ్గొట్టేకొద్దీ ఇస్తూనే ఉంటారు. విజయ్ మాల్యా, నిరవ్ మోదీ, మోహుల్ చోక్సీ లాంటి వాళ్లు అప్పులు తీసుకుని పారిపోతూనే ఉన్నారు. బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి.
అంటే మెండి బాకీలు పెరుగుతున్నాయి.. స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతున్నాయి. అంటే నోట్ల రద్దు వల్ల బ్లాక్ మనీ పెరిగినట్లా..? తగ్గినట్లా..? మీరే ఆలోచించండి..!