పెట్రోల్, డీజిల్ ధరల పెరుదలకు వ్యతిరేకంగా.. భారత్ బంద్ జరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు కొత్త రికార్డు నమోదవుతోంది. అందుకే ఇప్పుడు పెట్రో ధరలను ఎందుకు తగ్గించలేకపోతున్నారన్న చర్చ దేశవ్యాప్తంగా ప్రారంభమయింది. కానీ కేంద్రం తగ్గించాడనికి ప్రయత్నించడం లేదు. ఎలా ఎందుకు జరుగుతోంది..? కేంద్రం ఎందుకు తగ్గించడం లేదు..?
బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు తగ్గించడం లేదు..?
పెట్రోల్ ధరలు తగ్గిచాలంటే.. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చినప్పుడు.. అంటే 2014 ఉన్న ఎక్సైజ్ పన్నును కొనసాగిస్తే చాలు.. రూ. 15 రూపాయల వరకు రేటు తగ్గిపోతోంది. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గిపోయినా.. వినియోగదారులకు ఆ ఫలితం బదిలీ చేయకుండా… ఎక్సయిజ్ పన్నులు పెంచుకుంటూ పోయారు. మాట్లాడితే రాష్ట్రాలు తగ్గించాలి.. తగ్గించాలి అంటారు. రాష్ట్రాలు అంటే ఎవరు..? ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాలన్నీ తగ్గిస్తే… ఆటోమేటిక్‌గా ఇతర రాష్ట్రాలపై కూడా ఒత్తిడి పెరిగి తగ్గిస్తారు.
మోడీ వచ్చాక పెంచిన పన్నులు తగ్గిస్తే చాలు..!
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014 మే నుంచి 2016 జూన్ వరకు.. తొమ్మిసార్లు.. ఎక్సయిజ్ టాక్స్ పెరిగింది. దాదాపుగా లీటర్‌పై రూ. 15కిపైనే టాక్స్ పెంచారు. అప్పుడు చములు ధరలు బాగా తగ్గాయి. అప్పుడు ధరలు తగ్గిస్తే.. మళ్లీ పెరిగినప్పుడు ప్రజలు భరించలేరన్న కారణంతో కేంద్రం ఎక్సయిజ్ పన్నును పెంచింది. కానీ అంతర్జాతీయ మార్గెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు… ధరలు పెంచకుండా ఉండాలి. కానీ ప్రభుత్వం పెంచుకుంటూనే పోతోంది. మోదీ మొదట్లో ఎక్సయిజ్ ట్యాక్స్ ను తగ్గిస్తేనే… లీటర్‌కు పదిహేను రూపాయలు సులువుగా తగ్గిపోతుంది. యూపీఏ హయాంలో ఉన్నప్పుడు పన్నులు ఉంచితే చాలు… పదిహేను రూపాయలు పెట్రోల్ రేటు తగ్గిపోతుంది.
ఆదాయం తగ్గిపోవడానికి కారణం ఎవరు..?
జీఎస్టీలో పెట్రోలు, డీజిల్‌ను చేర్చేడానికి రాష్ట్రాలు అంగీకరించడం లేదని చెబుతున్నారు. కానీ జీఎస్టీ వల్ల గత ఏడాది రాష్ట్రాలకు రూ. 65వేల కోట్లకుపైగా నష్టం వచ్చింది. జీఎస్టీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని భరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ను కూడా జీఎస్టీలోకి చేర్చి.. ఆ నష్టాన్ని కూడా.. రాష్ట్ర ప్రభుత్వాలకు భర్తీ చేస్తే రాష్ట్రాలు ఎందుకు ఒప్పుకోవు..?. ఏడాది రూ. 2.70 లక్షల కోట్లకుపైగానే… పెట్రో ఆదాయాన్ని పొందుతోంది. ఇతర రంగాల్లో ఆదాయం పడిపోయిందని.. చెబుతున్నారు..?. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ఆదాయం తగ్గింది. దానికి ఎవరు బాధ్యలు..? అలా పనికి రాని విధానాల వల్ల.. ఆదాయం కోల్పోతే.. ప్రజల మీద భారం వేస్తారా..?. రూపాయి పతనం కూడా.. ఓ కారణం కూడా చెబుతోంది. రూపాయి పతనానికి ఎవరు కారణం..?. రూపాయి పతనాన్ని ఎందుకు ఆపలేరు..?. 2013లో దాదాపుగా ఇలాంటి పరిస్థితే వచ్చింది. డాలర్ కు, రూపాయికి మధ్య.. చాలా దూరం వచ్చింది. అప్పుడు ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న రఘురాం రాజన్.. డాలర్‌కి , రూపాయి మధ్య దూరం మరీ ఎక్కువగా ఉండకూడదన్న ఉద్దేశంతో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించారు. బంగారం దిగుమతులపై టాక్సులు పెంచారు. ఇష్టం వచ్చినట్లుగా బంగారం కొనకుండా చేశారు. ఆ మాటకొస్తే పెట్టుబడులు తిరిగి పోకుండా.. అనేక నియంత్రణలు పెట్టారు. డాలర్లు తెచ్చుకోవడానికి ప్రభుత్వం పడని పాట్లు లేవు. ప్రవాస భారతీయులు డాలర్లు తీసుకొచ్చి.. దేశంలో పెట్టుబడులుగా పెట్టాలని… విజ్ఞప్తి చేసింది. అలా దాదాపుగా రెండు వేల కోట్ల డాలర్లు దేశానికి వచ్చాయి. ఆ చర్యల వల్ల డాలర్‌కు, రూపాయికి మధ్య దూరం బాగా తగ్గిపోయింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మళ్లీ మళ్లీ దూరం పెరుగుతూనే ఉంది.
రూపాయి పతనాన్ని ఎందుకు ఆపరు..?
కేవలం అమెరికాలో ఉన్న పరిస్థితుల వల్లే..డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం లేదు. భారత్‌లో ఉన్న పరిస్థితులు కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ విధానాలు దీనికి కారణం. కొంత కాలం నుంచి దిగుమతుల్ని విస్తృతంగా సరళతరం చేసింది ప్రభుత్వం. ఫలితంగా.. అవసరం ఉన్నా లేకపోయినా… ఇష్టం వచ్చినట్లు దిగుమతులు చేసుకుంటున్నారు. చైనాను మించి బంగారం దిగుమతి అవుతోంది. విలాసవస్తువులను దిగుమతి చేసుకుంటున్నారు. ఇన్ని జరుగుతున్నా… ప్రభుత్వం చలించడం లేదు. ఆర్బీఐ పట్టించుకోవడం లేదు. ఆర్బీఐ వద్ద పుష్కలంగా డాలర్లు ఉన్నాయి. వాటిని విడుదల చేస్తే.. డాలర్‌కి, రూపాయికి మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. కానీ ఆ పట్టించుకోవడం లేదు. డాలర్‌కి, రూపాయికి మధ్య ఏం జరిగినా మార్కెట్‌కు వదిలేయమని కేంద్రం, ఆర్బీఐ చెబుతోంది.
ధరను నియంత్రించడానికి కనీస ప్రయత్నం ఎందుకు చేయరు..?
పెట్రో ధరలను నియంత్రించడానికి చేసుకోవాల్సిన ప్రయత్నం.. “స్టేట్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్”. అంటే.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర బాగా తక్కువకు కొని.. నిల్వ ఉంచుకోవడం. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగినప్పుడు ఉపయోగించుకోవచ్చు. కానీ ఇప్పుడు మన దేశంలో ఆయిల్ రిజర్వ్ బాగా తగ్గిపోయింది. ఇలాంటి ప్రయత్నాలేమీ చేయకుండా.. పెట్రోలు ధరలు పెరిగిపోతున్నాయని చెప్పి.. ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.