మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ గతంలో తన చానల్ లో మాత్రమే వీడియోలు చేసేవారు. అతి కష్టం మీద వేరే చానళ్లతో మాట్లాడేవారు.కానీ గత రెండు నెలలుగా ఆయన వైసీపీ కోసం ఏ చానల్ కు పోవాలంటే ఆ చానల్ కు పోయి మాట్లాడుతూ వస్తున్నారు. ఈ విషయంలో వైసీపీని అడ్డగోలుగా సమర్థన చేసి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత మెల్లగా మళ్లీ కొత్త కొత్త మాటలు చెబుతూ.. వినేవారిని ఆశ్చర్య పరుస్తున్నారు.
ఓ సందర్భంలో అసలు తాను ఏపీలో ఎవరు గెలుస్తారో చెప్పలేదన్నారు. టీడీపీ గెలుస్తుందా.. వైసీపీ గెలుస్తందా అనేది తానెప్పుడు చెప్పలేదని.. జగన్ చాలా తప్పులు చేశారని లెక్కలు తీయడం ప్రారంభించారు. ఈ డోస్ రాను రాను పెరిగిపోయింది. చివరికి జగన్ కు ఎందుకింత టెన్షన్ అని కొత్త పాట ప్రారంభించారు. జగన్ చాలా తప్పులు చేశారని.. ఆయన అనుభవించే ఫలితం స్వయంకృతాపరాథమేనని తేల్చారు. నాగేశ్వర్ ట్రాన్స్ ఫర్మేషన్ చూసి ఆయనను ఫాలో అయ్యేవాళ్లు కూడా ఔరా అనుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని పోలింగ్ ముందు ఈ నాగేశ్వర్ విశ్లేషించలేదు. టీడీపీ చేసిన తప్పుల్నే .. కూటమి చేసినట్లుగా చెబుతున్న తప్పుల్నే విశ్లేషించారు. జగన్ రెడ్డి అన్నీ ఒప్పులే చేశారని.. చివరికి పాస్ బుక్ మీద ఫోటోలు వేసుకోవడాన్ని కూడా సమర్థించారు. టీడీపీ తన హామీల గురించి ప్రచారం చేసుకోలేదని కూడా చెప్పుకొచ్చారు. అయితే పోలింగ్ అయిపోయిన తర్వాత మాత్రం ఆయనకు జ్ఞానోదయం అయిందేమో కానీ.. జగన్ రెడ్డి ఫలానా తప్పులు చేశారంటూ లెక్కలు చెబుతున్నారు. ఇలాంటి విశ్లేషకవేత్తల వల్లే జగన్ రెడ్డి నిండా మునిగిపోతున్నారని ఆవేదన చెందే వైసీపీ నేతలు కూడా ఎక్కువగానే ఉన్నారు.