తెలంగాణకు వచ్చి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై, కేసీఆర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. టీఆర్ఎస్ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. రామ్‌మాధవ్ జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్న నేత. ప్రజల్లో లేకపోయినా… రాజకీయాల్లో పలుకుబడి ఉంది. కొన్ని రాష్ట్రాలకు ఇన్చార్జ్ గా ఉండి బీజేపీకి మంచి విజయాలు అందించారు. ఆ స్థాయి నేత… మగతనం అంటూ విమర్శలు చేస్తారని ఎవరూ ఊహించరు.
“మగతనం” వ్యాఖ్యలు రామ్‌మాధవ్ స్థాయికి తగునా..?
నిజానికి రామ్ మాధవ్… టీఆర్ఎస్ పాలన, విధానాల కన్నా.. వ్యక్తిగత విమర్శలే ఎక్కువ చేశారు. కేసీఆర్‌ది కుటుంబపాలన అంటూ విమర్శించారు. నిజానికి బీజేపీ కుటుంబ పాలనకు అంత వ్యతిరేకమా అంటే కాదనే చెప్పాలి. కశ్మీర్లో నిన్నామొన్నటిదాకా కలసి ఉన్న పీడీపీది కుటుంబపాలనే. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలి వరకు పొత్తులో ఉన్న టీడీపీ కూడా వంశపారంపర్యపాలన కిందకే వస్తుంది. మహారాష్ట్రలో శినసేన సహా .. పలు పార్టీలు బీజేపీకి మిత్రులుగా ఉన్నాయి. వీటన్నింటినితో బీజేపీ కలసిన నడిచిన విధం చూస్తే వంశపారంపర్య పాలనకు వ్యతిరేకం అని చెప్పలేము. ఒక్క టీఆర్ఎస్ విషయంలోనే వంశపారంపర్య విషయాన్ని ఎందుకు హైలెట్ చేస్తున్నారు..?. నిజంగా వంశపారంపర్య పాలనను వ్యతిరేకిస్తూంటే ఉన్న పళంగా.. శివసేనతో తెగదెంపులు చేసుకోవాలి. అలాగే మేఘాలయాలో ప్రభుత్వం నుంచి బయటకు రావాలి. ఒడిషాలో బీజేడీతో ఉన్న అప్రకటిత స్నేహాన్ని వదలుకోవాలి. రేపు ఏపీలో వైసీపీతో కలవకూడదు. ఇవన్నీ చేసిన తర్వాతే వంశ పారంపర్య పాలన మీద పోరాడుతున్నాం అని చెబితే… టీఆర్ఎస్ మీద చేసిన విమర్శలకు న్యాయం చేసినట్లవుతుంది.
టీఆర్ఎస్ శతృవు అని ఎందుకు ప్రకటించలేదు..?
రామ్ మాధవ్ టీఆర్ఎస్ను విధాన పరంగా ఎక్కడా విమర్శించలేదు. వ్యక్తిగతంగా.. కొంత మంది ఎమ్మెల్యేల ప్రవర్తనపై చేశారు. ఎమ్మెల్యేల ప్రవర్తనపై అఖిల భారత స్థాయి నాయకుడు వచ్చి ఎవరూ కామెంట్లు చేయరు. నిజానికి రామ్ మాధవ్… ఎట్టి పరిస్థితుల్లోనూ… 2019లో కానీ.. 2024లో కానీ.. టీఆర్ఎస్ మద్దతు తీసుకోబోమని నిర్ద్వంద్వంగా ప్రకటించి ఉంటే..విమర్శలకు ఓ సమర్థన ఉండేది. అవేమీ లేకుండా రామ్ మాధవ్ ఎందుకు ఈ విమర్శలు చేశారు..?.
తెలంగాణలో సీట్లు గెలుచుకుందామనే తాపత్రయమా..?
వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవాలనేది బీజేపీ తాపత్రయం. ఉత్తరాదిలో గత ఎన్నికల్లో మ్యాగ్జిమం సీట్లు వచ్చాయి. కానీ పశ్చిమ బెంగాల్, తెంలగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషాల్లో కలిపి బీజేపీకి ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ రాష్ట్రాల్లో వందకు పైగా పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో సీట్లు ఏమైనా పెంచుకోగలమా అనేది బీజేపీ తాపత్రయం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అవకాశం లేదు. ఉన్న రెండు సీట్లు కూడా పోయే ప్రమాదం ఉంది. తెలంగాణలో ఏమైనా పెంచుకోవచ్చా అని బీజేపీ ఆశ పడుతోంది. టీఆర్ఎస్ ను టార్గెట్ చేయకుండా సీట్లు రావు. అందుకే రామ్ మాధవ్ టీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. ఇప్పటి వరకూ తెలంగాణకు వచ్చిన కేంద్ర నాయకులంతా టీఆర్ఎస్ ను పొగిడారు. ఇక నుంచి కేంద్ర నాయకులు కూడా పొగడరు. కేసీఆర్ ను ఎదుర్కొంటారన్న వాతావరణం క్రియేట్ చేయడానికి.. రామ్ మాధవ్ టీఆర్ఎస్ పై విమర్శల దాడి ప్రారంభించారనుకోవచ్చు.
సికింద్రాబాద్ సీటు నిలబెట్టుకోవడం కష్టమే..!
ఎన్ని చేసినా బీజేపీకి తెలంగాణలో సీట్లు పెరుగుతాయన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు ఉన్న సికింద్రాబాద్ కూడా ఉంటుందన్న గ్యారంటీ లేదు. 2014 రాష్ట్ర విభజన నేపధ్యంలో.. లక్షలాది మంది సీమాంధ్ర ఓటర్లు..టీఆర్ఎస్ కు ఓటు వేయకుండా.. టీడీపీ – బీజేపీకి కూటమికి ఓటు వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అప్పట్లో మోడీ వేవ్ ఉంది. ఇప్పుడు లేదు. సీమాంధ్ర ఓటర్లు కూడా బీజేపీ వెంట లేరు. టీడీపీతో పొత్తు తెగిపోయింది. పైగా సీమాంధ్ర ఓటర్లు గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారు. వీటన్నింటినీ చూస్తే.. బీజేపీ సికింద్రాబాద్ సీటును నిలబెట్టుకోడం కష్టమే. ప్రత్యేకహోదా అంశం ఎఫెక్ట్ తెలంగాణలోని సీమాంధ్ర ఓటర్లపై కూడా ఉంటుంది.. ఇది బీజేపీకి మరింత ఇబ్బందికరం.
రామ్‌మాధవ్ విమర్శల వెనుక ప్లాన్ బీ ఉంది..!
అందుకే టీఆర్ఎస్ ప్లాన్ బీ ఏమిటంటే.. తనంతట తానుగా సీట్లు గెలుచుకోవడం కష్టం కాబట్టి… తనకు మద్దతిచ్చేవారికి ఎక్కువ సీట్లు వచ్చేలా చేయాలి. కాంగ్రెస్ కు ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే బీజేపీకి నష్టం. కాంగ్రెస్ కు రాకుండా… టీఆర్ఎస్ కు ఎక్కు వ ఎంపీ సీట్లు వస్తే.. కాంగ్రెస్ పై కోపంతో..బీజేపీకి మద్దతిస్తారు. అందుకే టీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు వచ్చేలా వ్యూహం రూపొందించాలి. అలా ఎలా అంటే.. కాంగ్రెస్ కు వచ్చే ఓట్లను చీల్చాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చాలి. దాని వల్ల టీఆర్ఎస్ లాభపడుతుంది. దీని కోసమే బీజేపీ నేతలు టీఆర్ఎస్ పై దాడి ప్రారంభించారు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న వాతారవణం కల్పించడం ద్వారా… కాంగ్రెస్ కు వచ్చే కొన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చవచ్చనేది అసలు టార్గెట్. ఈ లక్ష్యంలో టీఆర్ఎస్ , బీజేపీ రెండు పార్టీలకు ఉపయోగం. రామ్ మాధవ్ విమర్శలతో… రెండు రోజుల పాటు..టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారింది. అంటే ఇదో విలువైన భాగస్వామ్యం లాంటిది. ఇద్దరికీ ఉపయోగపడుంది.