ఢిల్లీ యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తూ చేయని తప్పునకు జైలు పాలై చాలా కాలం పాటు తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొని చివరికి నిర్దోషిగా బయటకు వచ్చిన సాయిబాబా చనిపోయారు. మేధావి వర్గంలో ఆయనకు మంచి పేరు ఉంది. అభ్యుదయ భావాలు, పీడిత వర్గాల తరపున తన అభిప్రాయాలు చెప్పేందుకు ఆయన ఎప్పుడూ వెనుకాడలేదు.
ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలో సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ… 2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 2014 నుంచి ప్రొఫెసర్ సాయిబాబా నాగ్‌పూర్ జైల్లోనే ఉంటున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని.. ఫ్రోఫెసర్ సాయిబాబాతో పాటు ఐదుగురిపై UAPA కేసులు పెట్టింది. ఈ కేసులో 2017లో గడ్జిరౌలీ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. ఇప్పుడు ఈ ఉపా కేసులన్నింటినీ మహారాష్ట్ర హైకోర్టు నాగపూర్ ధర్మాసనం కొట్టివేసింది. ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ప్రొఫెసర్ సాయిబాబా చక్రాల కుర్చీకే పరిమితమైన వ్యక్తి. గొప్ప మేధోభావాలు కలిసిన వ్యక్తి. హక్కుల కోసం తన వాయిస్ వినిపిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని ఉగ్రవాదిగా… టెర్రరిస్టుగా ముద్ర వేసి పదేళ్లు జైల్లో ఉంచారు . 2014లో అరెస్ట్ అయ్యేనాటికి ప్రొఫెసనర్ సాయిబాబా ఢిల్లీ యూనివర్శిటీ లో జాబ్ చేస్తున్నారు. కేసు నేపథ్యంలో 2014లోనే ఆయనను యూనివర్శిటీ నుంచి సస్పెండ్ చేశారు. 2021లో విధుల్లోంచి తొలగించారు.
జైల్లో పెట్టిన తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. పలుసార్లు ఆయనకు వైద్యులు చికిత్స కూడా అందించారు. నిర్దోషిగా విడుదల అయిన తర్వాత ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇటీవల ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో నిమ్స్‌లో చేర్చారు. చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో చనిపోయారు.