సాయిబాబా అనే ప్రొఫెసర్‌కు మావోయిస్టులతో సంబంధాలు అంటగట్టి పదేళ్ల పాటు జైల్లో ఉంటారు. ఆయన చక్రాల కుర్చీకే పరిమితమైన వ్యక్తి. గొప్ప మేధోభావాలు కలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఉగ్రవాదిగా… టెర్రరిస్టుగా ముద్ర వేసి పదేళ్లు జైల్లో ఉంచారు ఇప్పుడు బాంబే హైకోర్టు ఆయనను నిర్దోషి అని ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఇప్పుడు ఆయన బయటకు వస్తారు. కానీ ఆయన విధించిన శిక్షకు ఎవరు న్యాయం చేస్తారు ? కుంగి కృశించిపోయిన ఆయన కుటుంబానికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు ?
ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ… 2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 2017లో గడ్జిరౌలీ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. 2014 నుంచి ప్రొఫెసర్ సాయిబాబా నాగ్‌పూర్ జైల్లోనే ఉంటున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని.. ఫ్రోఫెసర్ సాయిబాబాతో పాటు ఐదుగురిపై UAPA కేసులు పెట్టింది. ఇప్పుడు ఈ ఉపా కేసులన్నింటినీ నాగపూర్ ధర్మాసనం కొట్టివేసింది. ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
2014లో అరెస్ట్ అయ్యేనాటికి ప్రొఫెసనర్ సాయిబాబా ఢిల్లీ యూనివర్శిటీ లో జాబ్ చేస్తున్నారు. కేసు నేపథ్యంలో 2014లోనే ఆయనను యూనివర్శిటీ నుంచి సస్పెండ్ చేశారు. 2021లో విధుల్లోంచి తొలగించారు. చిన్నప్పటి నుంచే 90 శాతం వైకల్యంతో సాయిబాబా బాధపడుతున్నారు. జైల్లో పెట్టిన తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. పలుసార్లు ఆయనకు వైద్యులు చికిత్స కూడా అందించారు. ఏ ఆధారాలు లేకపోయినా పదేళ్ల పాటు జైల్లో ఉంచగలిగే వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయని.. ఇలాంటివి చూసినప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది.