హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధులలో కులోన్మాధం, అతివాదం, జాతి వ్యతిరేకత వంటి అవలక్షణాలు పెరిగిపోతున్నాయని, కనుక తక్షణమే కలుగజేసుకొని యూనివర్సిటీలో పరిస్థితులను చక్కదిద్దామని కోరుతూ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకి లేఖ వ్రాసారు. దానిపై తీవ్రంగా స్పందించిన మానవ వనరుల అభివృద్ధి శాఖ సదరు విద్యార్ధులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టవలసిందిగా ఆదేశించడంతో అంబేద్కర్ విద్యార్ధి సంఘానికి చెందిన ఐదుగురు విద్యార్ధులను యూనివర్సిటీ నుండి సస్పెండ్ చేయబడ్డారు. ఆ కారణంగానే రోహిత్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకొన్నాడని స్పష్టం అవుతోంది.
రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన ఈ పరిణామాలను అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలపై ప్రముఖ ప్రొఫెసర్ కంచె ఐలయ్య చాలా ఘాటుగా స్పందించారు. యూనివర్సిటీలో విద్యార్ధులు ఉగ్రవాదులు, తీవ్రవాదులు, దేశద్రోహులు అన్నట్లుగా బండారు దత్తాత్రేయ కేంద్రానికి లేఖ వ్రాయడాన్ని ఆయన తప్పు పట్టారు. వారి వద్ద తుపాకులు, బాంబులు వంటివేవయినా దొరికాయా? చదువుకోవడానికి వచ్చిన విద్యార్ధులను పట్టుకొని వారు ఉగ్రవాదులు.. దేశాద్రోహులో అన్నట్లు లేఖ వ్రాయడం ఏమిటి? అని ప్రశ్నించారు. దళిత, బడుగు, బలహీన వర్గాలంటే బీజేపీ, ఆర్.ఎస్.ఎస్.లకు ఎప్పుడూ చులకనే అని అన్నారు. ఆ చులకన భావమే బండారు దత్తాత్రేయ లేఖలో కనిపిస్తోందని అన్నారు. దేశంలో చాలా యూనివర్సిటీలలో అగ్రకులాల పెత్తనం కొనసాగుతోందని వారిని ఎదిరించే ప్రయత్నం చేసినవారిని ఈ విధంగానే అణచివేయబడుతున్నారని ఐలయ్య అన్నారు.