ఎంసెట్ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారంలో తెలంగాణా ప్రభుత్వానిదే తప్పు కనుక సంబంధిత మంత్రులే దానికి బాధ్యత వహించాలని తెలంగాణా రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
హైదరాబాద్ లో నిన్న జేఏసి నేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా ప్రభుత్వ అశ్రద్ధ, అసమర్ధత కారణంగానే ఎంసెట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. కనుక దీనికి మంత్రులే బాధ్యతా వహించాలి. వారు రాజీనామా చేస్తారో లేదో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. కానీ ఈ వ్యవహారంపై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలి. విద్యార్ధుల భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణాకి ద్రోహం చేసినవారు మంత్రి వర్గంలో ఉంటే ఉండవచ్చు కానీ మా జేఏసిలో మాత్రం లేరు,” అని ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు.
ఎంసెట్ పేపర్లు లీక్ అవడం వెనుక ఎవరెవరు ఉన్నారో దర్యాప్తులో తేలుతుంది. ఒకవేళ ప్రభుత్వంలో మంత్రులు, అధికారులు ఎవరైనా బాధ్యులైనట్లయితే అదీ తేలుతుంది. కానీ వాటి కంటే ముందు, ఎంసెట్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలా వద్దా అని ప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకొనవలసి ఉంటుంది. అది చాలా క్లిష్టమైన నిర్ణయమేనని అందరికీ తెలుసు. అందుకే ప్రొఫెసర్ కోదండరాం కూడా ఆ విషయంలో తల దూర్చకుండా ‘తగిన నిర్ణయం’ తీసుకోమని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు.
యూనివర్సిటీల వైస్-ఛాన్సిలర్ల నియామకాలలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేకపోయిందని, తత్ఫలితంగా రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రంలో కార్పోరేట్ కాలేజీలపై కూడా ప్రభుత్వానికి అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. ప్రభుత్వ అసమర్ధత కారణంగానే రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయిందని విమర్శించారు.
సమస్యలు ఎదురైన తరువాత అవి అందరి కళ్ళకి చాలా స్పష్టంగానే కనబడతాయి కనుక అప్పుడు వాటి గురించి మాట్లాడటం చాలా తేలికే..ఎవరినో ఒకరిని తప్పు పట్టడం కూడా తేలికే. కానీ ప్రొఫెసర్ కోదండరాం వంటి మేధావులు సైతం ఇటువంటి సమస్యలని ముందుగానే గుర్తించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయలేకపోవడమే విచిత్రంగా ఉంటుంది. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చాలా ఏళ్ళు ప్రొఫెసర్ గా పనిచేశారు. కనుక యూనివర్సిటీలలో ఎటువంటి సమస్యలు పేరుకుపోయి ఉన్నాయో, వాటికీ సరైన పరిష్కార మార్గాలేమిటో ఆయనకి తెలిసే ఉంటుంది.
తెలంగాణా రాజకీయ జేఏసి రాజకీయ పార్టీ కాదు…ప్రతిపక్ష పార్టీ కూడా కాదు. కనుక రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేసిన తరువాత దానిపై అయన ఈవిధంగా విమర్శలు చేసే బదులు, ఇప్పుడైనా నిర్మాణాత్మక సలహాలు సూచనలు ఇస్తే బాగుండేది. ఆయన సలహాల్ని ప్రభుత్వం స్వీకరిస్తుందా లేదా అనేది వేరే సంగతి. ముందు ఈ ఎంసెట్ వ్యవహారంలో, యూనివర్సిటీల వైస్-ఛాన్సిలర్ల నియామకాల విషయంలో, రాష్ట్రంలోని విద్యావ్యవస్థని సరిచేయడానికి అవసరమైన సలహాలు ఇస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. అవి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉపయోగపడతాయి కదా!