ఇవ్వాళ్ళ ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణా రాజకీయ జేయేసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మళ్ళీ కెసిఆర్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆయన జేయేసి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ,“తెలంగాణా రెండవ దశ ఉద్యమాలకి స్వర్గీయ జయశంకరే నాంది పలికారు. తెలంగాణా ప్రజలు అందరూ స్వేచ్చాయుతమైన జీవితం గడిపేందుకు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం అవసరమని ఆయన భావించారు. ఆయన ఆశయసాధన జరిగింది కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, కాంట్రాక్టర్లకి మాత్రమే మేలు కలిగించే విధంగా తెరాస పాలన సాగుతోంది. ఇటువంటి తెలంగాణా రాష్ట్రాన్ని ఆయన కోరుకోలేదు. ప్రజలు కూడా కోరుకోవడం లేదు. తెలంగాణా కోసం ఉద్యమించినప్పుడు కనిపించిన ఆ స్ఫూర్తి ఇప్పుడు తెరాసలో కనిపించడం లేదు. ఒకప్పటి దాని ఆశయాలకి, ఇప్పుడు దాని ఆశలకి చాలా తేడా కనబడుతోంది. తెరాస పాలనలో ప్రజల కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లే ప్రయోజనం పొందుతున్నారు. దీని కోసమేనా మనం ఇన్నేళ్ళుగా పోరాడింది? నేను ఇదేదో యధాలాపంగా చెపుతున్నమాటలు కావు. ప్రతీ అంశంపై చాలా లోతుగా అధ్యయనం చేసిన తరువాతనే చెపుతున్నాను. ప్రజల తరపున ప్రభుత్వం లేకపోతే, మేమే వారికి అండగా నిలబడి పోరాడుతాము,” అని అన్నారు.
ఇదివరకు తెరాస నేతలందరూ ప్రొఫెసర్ కోదండరాంపై మూకుమ్మడి దాడి చేసినందుకు ప్రజలు, ప్రతిపక్షాల నుంచి చాలా విమర్శలు మూటగట్టుకొన్నారు కనుక ఈసారి ఆయన వ్యాఖ్యలపై వారు చాలా ఆచితూచి స్పందించవచ్చు.
కెసిఆర్ నేతృత్వంలో తెరాస చేసిన పోరాటం వలననే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని తెరాస నేతలు చెప్పుకొంటుంటారు. కానీ ఆ క్రెడిట్ మొత్తం స్వర్గీయ జయశంకర్ కే దక్కుతుందన్నట్లుగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడటం తెరాస నేతలు జీర్ణించుకోవడం కష్టమే. ఆయన చెపుతున్న “రియల్ ఎస్టేట్ తెలంగాణా” అనే పదాన్ని కూడా వారు జీర్ణించుకోవడం ఇంకా కష్టం.
అయితే ఈ విషయంలో ప్రొఫెసర్ కోదండరాం కొంచెం అనుచితంగానే మాట్లాడినట్లు చెప్పక తప్పదు. ఎందుకంటే తెలంగాణా రాష్ట్రాభివృద్ధిలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పరిశ్రమలు, రోడ్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, చెరువుల త్రవ్వకాలు వంటి పనులు జరుగుతున్నాయి. అటువంటి పనులన్నీ ఏ ప్రభుత్వమూ కూడా స్వయంగా చేయలేదు. వాటిని కాంట్రాక్టర్లే చేయవలసి ఉంటుంది. అంతమాత్రాన్న ఆ పనుల వలన కేవలం వారు మాత్రమే లబ్దిపొందుతారని వాదించడం చాలా అసంబద్ధంగా ఉంది.
ఒకవేళ ఆ పనులలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నా వాటి వలన తెలంగాణా రాష్ట్రానికి, ప్రజలకి చాలా నష్టం జరుగుతోందని భావించినా దాని గురించి ప్రొఫెసర్ కోదండరాం వంటి మేధావులు ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నించాలి. ఇంకా ధైర్యం ఉంటే పార్టీ ఫిరాయింపుల గురించి ప్రశ్నించవచ్చు. తెలంగాణా కోసం బలిదానాలు చేసుకొన్న యువకుల కుటుంబాలకి న్యాయం చేయమని కోరవచ్చు. మల్లన్నసాగర్ తదితర ప్రాజెక్టులలో నిర్వాసితుల తరపున నిలిచి వారికి న్యాయం చేయమని ప్రభుత్వంతో పోరాడవచ్చు. కానీ తెలంగాణా వ్యాప్తంగా జరుగుతున్న నిర్మాణపనులను తప్పు పట్టడం తప్పే అవుతుంది.