ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం అనూహ్యంగా మారుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను .. తమతో కలసి రావాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ కాస్త ఆలస్యంగా స్పందించినా.. కమ్యూనిస్టులతో తప్ప.. ఇంకెవరితోనూ కలవబోమని ప్రకటించారు. అయితే.. వారం రోజుల కిందటి వరకూ… జగన్, పవన్, మోడీలు కలిసి తనపై దాడికి వస్తున్నారని చెప్పిన చంద్రబాబు… ఇప్పుడు.. హఠాత్తుగా.. పవన్ కల్యాణ్‌ను ఆ జాబితా నుంచి ఎందుకు తొలగించినట్లు..? కలసి రావాలని ఎందుకు చెబుతున్నట్లు..? రేపు పవన్ కల్యాణ్ కలుస్తారని కూడా చెబుతారా..?
పవన్‌తో మళ్లీ పొత్తును కోరుకుంటున్నారా..?
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటూ ఉంటారు. ఇటీవలి కాలంలో ప్రత్యేకహోదా దగ్గర్నుంచి హైకోర్టు వరకూ అనేక సందర్భాల్లో ఇలాంటి మార్పును మనం చూశారు. ఇతర రాజకీయ నాయకులు కూడా ఇలా చేస్తారు. కానీ.. చంద్రబాబునాయుడు మరింత చురుగ్గా వ్యవహరిస్తారు. ఏపీపై దాడికి వస్తున్న వారిలో కొత్తగా కేసీఆర్‌ను చేర్చి.. పవన్ ను మైనస్ చేశారు. మోడీ, మిడిల్ మోడీ కేసీఆర్, జూనియర్ మోడీ జగన్ అంటున్నారు కానీ.. పవన్ మోడీని లేకుండా చేశారు. అంటే.. పవన్ కల్యాణ్ విషయంలో తన వ్యూహం మార్చుకున్నారన్నమాట. పవన్ కల్యాణ్‌ను జాగ్రత్తగా డీల్ చేసి ఉంటే.. ఆయన తమతోనే ఉండేవారన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే ఉంది. పవన్ కల్యాణ్ విషయంలో చంద్రబాబు… సాఫ్ట్‌గానే వ్యవహరించారు. అయితే… ఆయనను టీడీపీ సరిగ్గా డీల్ చేయలేదనే అభిప్రాయం టీడీపీ సీనియర్ నేతల్లోనే ఉంది. ఆయనతో సరిగ్గా డీల్ చేసి ఉంటే పవన్ కల్యాణ్ టీడీపీతోనే ఉండేవారని.. చెబుతున్నారు. అంటే… టీడీపీ నేతల్లోనే.. పవన్ విషయంలో రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి.
పవన్ ఫ్యాన్స్‌ని గందరగోళంలో పడేయాలనుకున్నారా..?
చంద్రబాబునాయుడు.. ఇప్పటి వరకూ.. పొత్తుల్లేకుండా ఎప్పుడూ పోటీ చేయలేదు. గత తెలంగాణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ ఎన్నికల తరవాత.. చంద్రబాబు.. కాస్త రియలైజ్ అయ్యారు. విభజన సెంటిమెంట్ ఎక్కువగా ఉందని… తెలంగాణ ఎన్నికల్లో తేలిన తర్వాత కాంగ్రెస్ తో పొత్తు విషయంలో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు అనేది.. కేవలం ఢిల్లీకే పరిమితమని… ఏపీకి అన్యాయం చేసిన మోడీని మళ్లీ ప్రధానిని కాకుండా చేయడమే లక్ష్యమని… అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలుస్తామనే వాదన తెరపైకి తెస్తున్నారు. అదే సమయంలో.. ఏపీలో పొత్తుల కోసం ఓ పార్టీ కావాలి. అందుకే ఆయన జనసైన వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ ను వద్దనుకున్నప్పుడు… బీజేపీ వదిలేసినప్పుడు… ఇక ఆప్షన్ జనసేన ఉంది. అందుకే జనసేనను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబును ఓడించడానికి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద వ్యూహాలే రచిస్తోంది. ఇందులో భాగంగా జగన్, పవన్ లను కలిపే ప్రయత్నం చేస్తోంది. వీరిద్దరూ కలిస్తే.. చంద్రబాబుకు కచ్చితంగా ప్రమాదఘంటికలు మోగినట్లే. ఇలా కలవకుండా ఉండటానికి కూడా.. చంద్రబాబు… జనసేనలకు కలసి రావాలని పిలుపు ఇచ్చి ఉండవచ్చు. అలాగే… పవన్ కల్యాణ్ పై తాను ఎంతో సాఫ్ట్ గా ఉన్నానని చెప్పుకుని… పవన్ అభిమానుల్లో టీడీపీ పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్ తెచ్చుకునే ఎత్తుగడ కూడా ఇందులో ఉండవచ్చు.
పవన్ తనను విమర్శించకుండా మైండ్‌గేమ్ ఆడుతున్నారా..?
అదే సమయంలో.. చంద్రబాబునాయుడు మైండ్ గేమ్ ఆడుతున్నారా.. అనే మరో సందేహం కూడా వస్తోంది. ఎందుకంటే.. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు… చంద్రబాబునాయుడు పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చార్జిషీట్లు వేశారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు.. ఢిల్లీ వెళ్లి రాహుల్‌ను కలిసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు.. కాంగ్రెస్ నేతలు టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించాలో పొగడాలో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని జనసేనపై కూడా అమలు చేసినట్లుగా ఉంది. పవన్ అభిమానుల్లో ఇప్పుడు టీడీపీని పొగడాలా.. తిట్టాలా.. అన్న సందేహం కూడా ప్రారంభమయింది. ఇది టీవీ చానళ్లకు వచ్చే జనసేన ప్రతినిధుల్లోనే కనిపించింది. వారు చంద్రబాబు ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుతో కలవము అని చెప్పలేకపోయారు. ఈ గందరగోళాన్ని చంద్రబాబు… సృష్టించడం ద్వారా… పవన్ కల్యాణ్ తనను విమర్శించకుండా.. మైండ్ గేమ్ ఆడుతున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి.