తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కొద్ది రోజులుగా.. ఈవీఎంలపై పోరాటం చేస్తున్నారు. ఏపీలో పోరాటం ముగిసిన తర్వాత ఢిల్లీకి తన కార్యక్షేత్రాన్ని మార్చారు. టెక్నాలజీని ప్రొత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారన్న ప్రచారం ఉంది. స్వయంగా ఆయనే చెప్పుకుంటారు కూడా. అయినప్పటికీ.. ఇప్పుడు ఈవీఎంలపై.. ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తూండటంతో… రాజకీయ పార్టీల్లో ఓ రకమైన కలకలం బయలుదేరిందని చెప్పవచ్చు.
ఈవీఎంలపై గెలిచిన పార్టీలు ఎందుకు సందేహాలు వ్యక్తం చేయవు..?
టెక్నాలజీని ఎంతగానో స్వాగతించే తాను కూడా.. ఈవీఎంలను… వ్యతిరేకిస్తున్నానంటే.. అందులో ఎన్ని లోపాలున్నాయో అర్థం చేసుకోవచ్చని.. చంద్రబాబు చెబుతున్నారు. ఈవీఎంలపై ఇప్పుడే కాదు… వాటిని ప్రవేశ పెట్టిన దగ్గర నుంచి… రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకించాయి. అయితే.. ఓడిపోయిన పార్టీలు మాత్రమే ప్రతీ సారి ఈ తరహా ఆరోపణలు చేస్తున్నాయి. 2009లో బీజేపీ ఈవీఎంలను తప్పు పట్టింది. ఈవీఎంలు వద్ద బ్యాలెట్ కావాలని అన్నది. 2014లో ఈవీఎంలు అద్భుతమని చెప్పడం ప్రారంభించారు. కేసీఆర్ 2009లో ఈవీఎంలో బోగస్.. అన్నారు. వాటిని ఎలా అయినా మార్చవచ్చన్నారు. గత మూడేళ్లుగా ఈవీఎంలు భేష్ అంటున్నారు. చంద్రబాబునాయుడు కూడా.. 2009లో ఈవీఎంలు తప్పు పట్టారు. 2014లో ఈవీఎంలను ప్రశ్నించలేదు. 2019లో ఈవీఎంలను ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే.. మళ్లీ బ్యాలెట్ ఎన్నికలకు వెళ్తారా అన్నది అందరిలోనూ వస్తున్న ప్రశ్న. నిజంగా ఈవీఎంలపై అనుమానం ఉంటే.. గత ఎన్నికల్లో గెలిచినప్పుడే… గతంలో.. బీజేపీ సహా అందరూ… ఈవీఎంలను వ్యతిరేకించినందున.. ఎన్నికల కోసం.. మళ్లీ బ్యాలెట్ తెద్దామని.. .. ప్రయత్నించాల్సి ఉంది. కానీ చంద్రబాబు అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఎన్నికల్లో గెలిచిన పార్టీ అయినా… తాము ఎన్నికల్లో గెలిచాం.. అయినప్పటికీ.. ఈవీఎంలు ట్యాంపర్ అయ్యే అవకాశం ఉంది. అయినా సరే.. బ్యాలెట్కే పోదాం.. అన్న రాజకీయపార్టీ ఇంత వరకూ దేశంలో లేదు.
మనిషి సృష్టించిన టెక్నాలజీ..! మనిషి సులువుగా ట్యాంపర్ చేయగలరు..!
రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడ మాత్రం.. ఈవీఎంలపై ఎలాంటి తప్పుపట్టలేదు.కానీ తెలంగాణలో మాత్రం ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు. ఎలా నమ్ముతారు..? ఈవీఎంలను మానిప్యులేట్ చేయాలంటే.. ఈసీ సహకారం లేకుండా చేయలేరు. ఈసీ మోడీ చేతుల్లో ఉంటుంది. మోడీ… ట్యాంపర్ చేయించగలిగితే… ఆ మూడు రాష్ట్రాల్లో మోడీ బీజేపీని గెలిపించుకోకుండా ఉంటారా..?. గెలిచిన తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా.. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయలేదు. ఇలా చేయడం వల్ల.. పార్టీలు చేస్తున్న పోరాటానికి అర్థం ఉండదు. అలా అని.. ఈవీఎంలను… మ్యానిపులేట్ చేయడం లేదా.. అంటే .. చేయట్లేదని చెప్పలేం. ఈ టెక్నాలజీ.. మొత్తం మనిషి సృష్టించిన టెక్నాలజీ. ఈ టెక్నాలజీ మార్చుకోవడం… పెద్ద విషయం కాదు. మనిషికి అది సాధ్యం కాని విషయం కాదు. అందుకే.. ఎప్పటికప్పుడు.. సమీక్ష చేసుకోవాలి. అంతే కానీ… ట్యాంపరింగ్ జరగదని వాదించడ కరెక్ట్ కాదు. అది వాదిస్తే తప్పే అవుతుంది. మనిషి సృష్టించుకున్న టెక్నాలజీని.. మనిషి సులువుగానే అధిగమించగలడు.
వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కిస్తే ఈసీకి వచ్చే నష్టం ఏమిటి..?
ఈవీఎంలపై అనుమానాలు రాకుండా… చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఈసీకి ఉంది. ఇప్పుడు.. ఈసీ… అలాంటి పరిస్థితుల్లో లేదు. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించడానికి ససేమిరా అంటూండటంతోనే అనుమానాలు వస్తున్నాయి. ఆరు రోజులు పడుతుందని.. మరొకటని ఈసీ వాదిస్తోంది. దీని వల్ల ఈసీకి వచ్చే నష్టం ఏమిటి..?. లెక్క పెట్టేది ఏపీ ప్రభుత్వ ఉద్యోగులే.. ఖర్చులేమైనా ఉంటే.. ఏపీ ప్రభుత్వ ఖజానా నుంచే తీసుకోండి. యాభై శాతం.. వీవీ ప్యాట్ మిషన్లు లెక్కపెట్టడానికి ఈసీకి వచ్చే అభ్యంతరం ఏమిటి..? అనే దానికి ఆన్సర్ చెప్పాల్సి ఉంది. ఇప్పటి వరకూ.. అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటి వరకూ.. ఒక్కటి మాత్రమే లెక్క పెడుతోంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఐదు లెక్క పెడతానంటోంది. ఐదు వందలు లెక్క పెడితే.. ఈసీకి వచ్చే ఇబ్బందేమిటి..?. లెక్కింపుకి అవసరమైన సిబ్బంది, ఖర్చులు.. అన్నీ… ప్రభుత్వమే భరిస్తుంది కదా..!. ఎంత చూసినా.. రూ. ఇరవై కోట్లు ఖర్చు అవుతుందనుకున్నాం..! ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచడానికి ఇదేమైనా పెద్ద ఖర్చా..?. ఇదంతా తెలిసి కూడా… ఎన్నికల కమిషన్.. లెక్కపెట్టేది లేదని ఎందుకు భీష్మించుకు కూర్చుంది..? దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది.
ఏపీ ఎన్నికల్లో మొరాయించిన ఈవీఎంలపై ఈసీ సంజాయిషీ ఏమిటి..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంలు పెద్ద ఎత్తన మొరాయించాయి. కొన్ని వందల పోలింగ్ బూతుల్లో… ఈవీఎలంను రీప్లేస్ చేశారు. పాత ఈవీఎంలను.. ఏపీకి పంపారన్న ప్రచారం జరుగుతోంది. కొత్తవి ఉండగా.. పాతవాటిని ఏపీకి ఎందుకు పంపారు..?. వేల సంఖ్యలో … అవి మొరాయించాయని.. వాటిని ఇంజినీర్లు వచ్చి రిపేర్ చేశారని చెబుతున్నారు. ఎవరా ఇంజినీర్లు..?. వారు వచ్చి మొరాయించిన ఈవీఎంలను… పని చేసేలా చేశారా లేక.. ఇంకేమైనా చేశారా.. అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సాంకేతిక నిపుణులు.. ఈవీఎంలను మ్యానిపులేట్ చేయరని గ్యారంటీ ఏమిటన్న అనుమానం ప్రజల్లో ఉంది. వీటన్నింటికీ.. ఈసీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే అనుమానాలు పెరిగిపోతాయి.