జీవీఎల్ నరసింహారావు ఏపీ ప్రభుత్వంపై కొత్త తరహా ఆరోపణలు ప్రారంభించారు. చంద్రబాబునాయుడు ప్రజాధనాన్ని దుర్వనియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతే కాదు… ఆయన అధికారులపై కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం పెట్టే ఖర్చులకు అధికారులు బాధ్యులు కాబట్టి.. వారిపై చర్యలకు ఫిర్యాదు చేస్తామని.. జీవీఎల్ అంటున్నారు. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు.
చంద్రబాబు రాజకీయ పర్యటనల ఖర్చు ఎవరు పెట్టుకుంటున్నారు..?
ఉత్తరప్రదేశ్ ఎంపీ జీవీఎల్ నరసింహారవు ఏపీ ప్రభుత్వ ఖర్చులపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబునాయుడు స్టార్ హోటల్స్ లో ఉంటున్నారని.. విమానాల్లో తిరుగుతున్నారని విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రుల్లో బస్సుల్లో తిరుగుతారా..? ఏ ముఖ్యమంత్రి విమానాల్లో తిరగడం లేదు. ఆయన బీజేపీ నాయకుడు కాబట్టి.. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు ఫ్రంట్ కడుతున్నారు కాబట్టి.. ఆయన ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లారు.. బెంగళూరు వెళ్లారు.. చెన్నై వెళ్లారు.. కోల్‌కతా వెళ్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఫ్రంట్ కడుతున్నారని కోపంతో… జీవీఎల్ ఇలాంటి మాటలు చెబుతున్నారు. తమకు వ్యతిరేకంగా ఫ్రంట్ కడుతున్నారనే కోపాన్ని బయటపెట్టుకోలేక ఈ మాటలన్నీ చెబుతున్నారు. నిజంగా చంద్రబాబు విమానాలు ఎక్కడం వల్ల… ఆయన స్టార్ హోటళ్లలో ఉండటం వల్ల ఏపీ ప్రభుత్వానికి నష్టం జరిగింది అని అనుకుంటే.. ఈ నాలుగేళ్లలో ఈ ప్రశ్న ఎందుకు లేవనెత్తలేదు. ఉదాహరణకు… హైదరాబాద్ సెక్రటేరియట్లో ఏపీ సీఎం చాంబర్‌కు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి… మార్పులు చేయించుకుని ఇక్కడ ఉండకుండా వెళ్లిపోయారు. దీన్ని నాలాంటి వాళ్లు ప్రశ్నించారు కానీ.. జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్లు ప్రశ్నించలేదు. ఎందుకంటే.. అప్పుడు ఆయన మిత్రపక్షం. అంటే.. మిత్రపక్షంగా ఉన్నప్పుడు.. ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. ఇప్పుడు వ్యతిరేకం అయ్యారు కాబట్టి… విమాన ప్రయాణాల్ని కూడా ప్రశ్నిస్తారా..?
ప్రభుత్వం ఖర్చు పెడితే ఆధారాలు చూపించి ప్రశ్నించొద్దా..?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… చెన్నై వెళ్లినా,… బెంగళూరు వెళ్లినా.. ఢిల్లీ వెళ్లినా.. ఆయన ప్రభుత్వ వ్యవహారాల కోసం .. వెళ్లలేదు కాబట్టి.. అది అధికారిక పర్యటన కాదు. ప్రభుత్వ వ్యవహారాలను చర్చించడానికి వెళ్లలేదు. చెన్నై వెళ్లింది ప్రభుత్వ వ్యవహారానికి కాదు కదా..?. రాజకీయ వ్యవహారాల కోసం…. చంద్రబాబు చేస్తున్న పర్యటన కాబట్టి… ఆ ఖర్చును తెలుగుదేశం పార్టీనే పెట్టుకోవాలి. ఇప్పుడు జీవీఎల్ అడగాల్సిన ప్రశ్న ఇదే. చంద్రబాబు రాజకీయ పర్యటనల ఖర్చు… ప్రభుత్వ ఖాతాలోనిదా.. టీడీపీ ఖాతాలోనిదా.. అని ప్రశ్నించాలి. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతోనే చంద్రబాబు.. రాజకీయ పర్యటనలు చేస్తే.. కచ్చితంగా దాన్ని ప్రశ్నించాల్సిందే. దాన్ని టీడీపీ ఖాతాలో వేయాల్సిందే. ఇప్పుడు గవర్నర్ కు జీవీఎల్ ఫిర్యాదు చేశారు కాబట్టి… టీడీపీ దీనిపై వివరణ ఇవ్వాలి. ప్రభుత్వ వ్యవహారాల కోసం ముఖ్యమంత్రి చేసే పర్యటనల ఖర్చు మాత్రమే ప్రభుత్వం పెట్టుకోవాలి. రాజకీయ వ్యవహారాల ఖర్చును టీడీపీ పెట్టుకోవాలి.
సీఎం ఆదేశాలు పాటించవద్దని ఉద్యోగుల్ని బెదిరిస్తారా..?
ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లు.. ఉద్యోగుల మీద పడుతున్నారు జీవీఎల్ నరసింహారావు. ఉద్యోగులు పెన్షన్లు, ప్రావిడెంట్ ఫండ్లకు ఎసరు పెడతాట. ఏం మనిషి ఆయన..?. ఉద్యోగులు ఏం చేస్తారు..?. ముఖ్యమంత్రి ఆదేశిస్తే చేయకుండా ఉండరా..? ఓ రాజకీయ నాయకుడికి కనీస పరిజ్ఞానం ఉండదా..? నరేంద్ర మోడీ ఆదేశిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేయరా..?. రాజకీయ నాయకుల్ని ఎలా అయినా ప్రశ్నించవచ్చు.. అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడ్ని విమర్శించినా… తప్పు లేదు. కానీ… మధ్యలో ఉద్యోగులు ఏం చేస్తారు..? . ముఖ్యమంత్రి చెబితే.. టిక్కెట్లు, హోటల్ రూములు బుక్ చేసిన వారి పెన్షన్లు కట్ చేస్తారట… పీఎఫ్ కట్ చేస్తరట..! జీవీఎల్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం అవుతుందో లేదో మరి..! చంద్రబాబు మీద కోపం ఉంటే.. ఆయన ఎన్నైనా అనుకోవచ్చు.. కానీ మధ్యలో సాధారణ ఉద్యోగుల్ని ఎందుకు బలి చేయాలనుకుంటున్నారు. అదీ కూడా పబ్లిక్‌గా బెదిరిస్తున్నట్లుగా అంటున్నారు… మేం.. వదలం.. కచ్చితంగా వచ్చి పీఎఫ్‌లు, పెన్షన్ల నుంచి వసూలు చేస్తామని చెబుతున్నారు. అంటే అర్థం ఏమిటి.. రేపు ఏపీలో బీజేపీకి ఓటేస్తే.. వారి పెన్షన్ గల్లంతవుతుంది. పీఎఫ్ గల్లంతవుతుంది.
ప్రధాని, బీజేపీ మంత్రుల రాజకీయ టూర్ల ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నారు..?
ఈ విధంగా..ఉద్యోగుల్ని బెదిరించే విధానం చాలా దుర్మార్గమయినది. రాజకీయంగా ఎవరు ఎవరైనా విమర్శించుకుంటారు. బీజేపీ వాళ్లు చంద్రబాబును దేశదిమ్మరి అంటారు… టీడీపీ వాళ్లు… జీవీఎల్‌ను ఆంబోతులంటారు. వీళ్ల మధ్య ఉద్యోగుల్ని ఎందుకు బలి చేయాలనుకుంటారు. అందుకే.. ఉద్యోగులపై దాడి చేసే విధానాలను.. జీవీఎల్ లాంటి నేతలు వదులుకోవాలి. అసలు ప్రధానమంత్రి ఎక్కడికైనా వెళ్లినప్పుడు సెవన్ స్టార్ హోటల్లో కాదా ఉండేది..? గుడిసెల్లో ఉంటున్నారా..? ప్రధానమంత్రే కాదు… బీజేపీ నేతలు ఎవరైనా రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటారు..? అమిత్ షా వచ్చేది విమానాల్లో.. ఉండేది స్టార్ హోటళ్లలో కాదా..? కిషన్ రెడ్డి స్టార్ హోటళ్లలో ఉండరా..?. ఎవరైనా చిన్న లాడ్జి చూసుకుని ఉంటారా..?. నీతులు చెప్పేటప్పుడు… తాము కూడా పాటించాలి. మోడీ, అమిత్ షా.. చివరికి జీవీఎల్ ఖర్చులు… విమాన టిక్కెట్లు, హోటల్ బిల్లులు ఏ ఖాతాలో వేశారో కూడా జీవీఎల్ చెప్పాలి. కేంద్రమంత్రులు బోల్డన్ని సార్లు రాజకీయం చేయడానికి హైదరాబాద్ వచ్చారు. అలా వచ్చినప్పుడు.. ఆ ఖర్చులన్న కేంద్రం పెట్టుకోలేదు.. పార్టీ పెట్టుకుందని.. కాయితాలు చూపించమనండి.
ఉద్యోగులపై ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా..?
అందుకని.. పారదర్శకతగా ఉండి… ఇతరులను పారదర్శకత గురించి అడగొచ్చు. చంద్రబాబును రాజకీయంగా ఎంతైనా విమర్శించుకోవచ్చు కానీ.. ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్లు లాక్కుంటామని.. బెదిరించడం మాత్రం అన్యాయం. దుర్మార్గం. ఉద్యోగులు పొట్టకూటి కోసం పని చేసుకుంటారు. ప్రభుత్వం చెప్పినట్లు చేస్తారు. వారిని విధులు నిర్వహించవద్దని… బ్లాక్ మెయిల్ చేసేలా వ్యవహరించడం … వారి ప్రయోజనాలను నిలపి వేస్తామని.. వారి పొట్ట కొడతామని బెదిరిరించడం దుర్మార్గం.