సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరక్టర్ అలోక్ వర్మ తొలగింపు వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. గతంలో.. ఓ సారి నేరుగా తొలగించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఈ సారి హైపవర్ కమిటీ ద్వారా ఆ పని చేశారు. గతంలో నేరుగా తొలగించిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అందుకే ఈ సారి.. సుప్రీంకోర్టు చెప్పినట్లు.. హైపవర్ కమిటీని ఆగమేఘాలపై సమావేశపర్చి అలోక్ వర్మని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టెక్నికల్‌గా.. ఇది కరెక్టే కానీ.. దేశ ప్రజలకు మోదీ సమాధానం చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.
కసబ్‌ను కూడా వివరణ అడిగారు కదా..! అలోక్ వర్మకు చాన్సివ్వలేరా..?
అలోక్‌వర్మపై నిర్ణయం తీసుకునేందుకు వారం రోజుల పాటు గడువు ఉన్నప్పటికీ… హైపవర్ కమిటీని సమావేశపరిచింది. ఇందులో… ప్రధాని మోదీతో పాటు… జస్టిస్ సిక్రీ కూడా.. తొలగింపునకు ఆమోదముద్ర వేశారు. కానీ కమిటీలో మరో సభ్యుడయిన ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే… అలోక్ వర్మకు… తనపై వచ్చిన ఆరోపణలకు… వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలన్నారు. ఉగ్రవాది కసబ్‌కు ఉరి వేసే ముందు కూడా… తన వివరణ ఇచ్చుకునే అవకాశం ఇచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా… శిక్షించే ముందు వివరణ అడగడం అనేది చాలా సహజం. సహజ న్యాయసూత్రం. అయినప్పటికీ… సీబీఐ వంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ డైరక్టర్ అయిన అలోక్ వర్మకు అలాంటి అవకాశం ఎందుకివ్వలేదు. తనపై వచ్చిన ఆరోపణలపై… తన వివరణ ఏమిటో ఎందుకు చెప్పుకోనీయలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ .. మొదట ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఆలోక్ వర్మ వివరణ తీసుకున్న తర్వాత చర్య తీసుకుంటే… ప్రజల్లో దీనిపై పెద్ద విమర్శలు వచ్చి ఉండేవి కావు.
సీవీసీ, సీబీఐ కొత్త డైరక్టర్పైనా ఆరోపణలు ఉన్నాయి కదా..?
అసలు సీబీఐలో వివాదం ఎప్పుడు వచ్చింది. రాకేష్ ఆస్థానా అనే గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారిని… అనేక అవినీతి ఆరోపణలు ఉన్న అధికారిని… సీబీఐ స్పెషల్ డైరక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి.. సీబీఐ డైరక్టర్‌గా ఉన్న అలోక్ వర్మ, ఆస్థానా మధ్య ఆధిపత్య పోరాటం నడిచింది. రాకేష్ ఆస్థానాపై..సీబీఐలో ఉన్నప్పుడు కూడా… అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిపై… అలోక్ వర్మ విచారణకు ఆదేశించారు. తనపై వచ్చిన ఆరోపణలను న్యూట్రలైజ్ చేయడానికి రాకేష్ ఆస్థానా కూడా అలోక్ వర్మపై ఆరోపణలు చేశారు. అంటే.. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నారన్న కారణంగానే.. అలోక్ వర్మపై రాకేష్ ఆస్థానా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల కారణంగానే… చీఫ్ విజిలెన్స్ కమిషనర్ అలోక్ వర్మను పదవి నుంచి తొలగించారు. నిజానికి సీవీసీపై కూడా ఆరోపణలు ఉన్నాయి. కొత్త తాత్కలిక డైరక్టర్ పైనా అరోపణలు ఉన్నాయి. అలోక్ వర్మపై అవినీతి పరుడని నిరూపణ అయితే.. ఆయన మరి ఏ ప్రభుత్వ సర్వీసులోనూ ఉంచకుండా తొలగించాలి. కానీ… మరో ప్రభుత్వ శాఖకు బదిలీ చేశారు. అంటే క్లియర్‌గా… ఇదంతా కావాలని చేస్తున్నారని అర్థమైపోతుంది. ఈ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు ఎందుకు ఇంత దిగజారిపోయాయి. చివరికి సీవీసీపై కూడా… అనుమానాలు వచ్చేంతగా… వ్యవస్థలు ఎందుకు పడిపోయాయి..?
రాఫెల్‌పై విచారణ ప్రారంభిస్తారనే భయంతోనే ఉద్వాసనా…?
అలోక్ వర్మ… సుప్రీంకోర్టు తీర్పు కారణంగా… సీబీఐ డైరక్టర్‌గా పదవి మళ్లీ చేపట్టినప్పటికీ.. ఆయనకు విధానపరమైన నిర్ణయం తీసుకునే అధికారం ఇవ్వలేదు. అదే సమయంలో జనవరి 31వ తేదీన రిటైర్ అవుతున్నారు. అయినప్పటికీ… ఆయనపై ఇంతం హడావుడిగా.. కేంద్రం చర్య తీసుకోవాల్సిన అవసరం ఏముంది..? బీజేపీ నేతలు.. యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలు.. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై… సీబీఐ డైరక్టర్కుఫిర్యాదు చేశారు. కొన్ని కీలకమైన పత్రాలు ఇచ్చారు. వాటిపై…విచారణ ప్రక్రియను ఎక్కడ ప్రారంభిస్తారో అన్న భయంతోనే… నరేంద్రమోడీ అయనను ఉన్న పళంగా … పదవి నుంచి తొలగించడానికి ప్రయత్నించారనేది స్పష్టమవుతోంది.
బీజేపీ ఏ వ్యవస్థనూ వదిలి పెట్టలేదు..!
ఇది ఒకటే కారు ఆర్బీఐ గవర్నర్ విషయంలోనూ అదే జరిగింది. ఆయనను బలవంతంగా పంపించేశారు. వ్యక్తిగత కారణాలు అని… ప్రభుత్వం చెబుతోంది కానీ.. ఆయనపై కేంద్రం పెట్టిన ఒత్తిడి అందరూ చేశారు. ఇది ఒక్కటే కాదు.. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా.. ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్‌ను నియమించాలని కొలిజియం సిఫార్సు చేసినప్పుడు.. కేంద్రం మొదట ఒప్పుకోలేదు. దానికి కారణంగా… అప్పట్లో.. బీజేపీ ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించింది. రాజ్యాంగపరంగా అతి తప్ప అని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఆ కోపంతోనే… ఆయనను సుప్రీంకోర్టుకు రానీయకుండా చేసే ప్రయత్నం చేసింది కేంద్రం. చివరికి ఆయననే తీసుకోవాలని కొలిజియం పట్టుబడితే..అవకాశం ఇచ్చారు.. అయితే సీనియార్టీ కట్ చేశారు. అంటే… తమకు వ్యతిరేకంగా తీర్పులు చెబితే.. న్యాయవ్యవస్థపైనా.. ఎంత దారుణంగా… వ్యవహరిస్తున్నారో తెలిపోతోంది. రాజ్యాంగపరమైన వ్యవస్థలపై… ఇలా దాడి చేస్తే.. భారత ప్రజాస్వామ్యం ఎలా మనుగడ సాగించగలుగుతుంది.