మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇటీవలి కాలంలో.. భిన్నమైన రాజకీయాలు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నంత వరకూ కాంగ్రెస్ పార్టీతో అత్యంత సన్నిహిత సంబంధాలు నడిపిన ఆయన ఇప్పుడు… యాంటీ కాంగ్రెస్ అంటూ.. చాలా తీవ్రమైన ప్రకటనలు చేస్తున్నారు. అసలు మజ్లిస్ ఎదిగింది..యాంటీ బీజేపీ పునాదుల మీద. బీజేపీ చూపిస్తున్న ముస్లిం వ్యతిరేకతను చూపించి మజ్లిస్ బలపడింది.
బీజేపీకి ఓవైసీ పరోక్షంగా ఎందుకు సహకరిస్తున్నారు..?
అసదుద్దీన్ ఓవైసీ చాలా రోజుల నుంచి భారతీయ జనతా పార్టీకి పరోక్షంగా సహకరిస్తున్నారనే ప్రచారం ఉంది. తెలంగాణలో నేరుగా టీఆర్ఎస్కు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్కు సపోర్ట్ చేస్తానని.. నేరుగా వెళ్లి ప్రచారం చేస్తానని కూడా ప్రకటించారు. నిజానికి ఈ రెండు పార్టీలు… బీజేపీకి దగ్గరగా ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి. జాతీయ రాజకీయాల్లో… కేసీఆర్ కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఆయనకు చాయిస్ బీజేపీతోనే ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన గట్టిగా ఎప్పుడూ వ్యతిరేకించలేదు. దాదాపు అన్ని అంశాలను సమర్థించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా.. బీజేపీకి పరోక్ష మద్దతుదారు. పరోక్షంగా అని ఎందుకు అనాల్సి వచ్చింది… రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో… అడగకుండానే.. వైసీపీ అధినేత జగన్ వెళ్లి మద్దతు ప్రకటించి వచ్చారు. ఆ తర్వాతా కూడా.. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన ఎక్కడా విమర్శించ లేదు. ఇప్పటికీ.. ఏపీలో విభజన సమస్యలను పరిష్కరించాలని ఆయన కేంద్రానికి ఎలాంటి డిమాండ్లు పెట్టడం లేదు. విమర్శలు చేయడం లేదు. పైగా… జగన్ కు ఉన్న ఒకే ఒక్క చాయిస్ బీజేపీ. ఎందుకంటే.. చంద్రబాబు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైపు చేరారు కాబట్టి… ఆయనకు మరో ప్రత్యామ్నాయం లేదు. అంటే..ఈ రెండు పార్టీలు.. బీజేపీతో కలవడానికి అవకాశం ఉన్న పార్టీలు. ఇలాంటి పార్టీలకు మద్దతిస్తామని ఓవైసీ చెప్పడం ఏమిటి..?
కాంగ్రెస్కు మైనార్టీ ఓట్లు ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు..?
ఓవైసీ రాజకీయాలు ఇటీలి కాలంలో బీజేపీని బలపరిచేలా ఉన్నాయి. ఇటీవలి కాలంలోనే తీసుకుంటే.. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా…కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అలాంటి సందర్భంలో… ఆయన జేడీఎస్ కు మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓట్లు పోకూడదన్న ఉద్దేశంతోనే.. ఆయన ఇలాంటి మద్దతు ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓట్లు పోకూడదన్న ఉద్దేశంతోనే.. ఆయన అస్సాం నుంచి.. రాజకీయాలు చేస్తున్నారు. యూపీ, మహారాష్ట్ర సహా బీజేపీ ఇటీవలి కాలంలో సాధించిన అనేక విజయాల్లో… మజ్లిస్.. ముస్లిం ఓట్లను చీల్చడం కూడా ఓ కారణం. ఇప్పుడు కాంగ్రెస్ మిత్రపక్షాలు ఉన్న చోట్ల కూడా… మజ్లిస్ అదే తరహా ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్కు ముస్లిం ఓట్లు ఎందుకు పోకుండా చేసి.. బీజేపీకి.. ఆ పార్టీకి సన్నిహితంగా ఉండే పార్టీలకు సాయం చేయడమే మజ్లిస్ వ్యూహం.
పదేళ్లు కాంగ్రెస్కు ఎందుకు మద్దతిచ్చారు..?
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లు.. కాంగ్రెస్ పార్టీతో మజ్లిస్ స్నేహ సంబంధాలు కొనసాగించింది. కేంద్రంలో.. రాష్ట్రంలో కూడా ఆ మద్దతు సాగించేంది. కానీ ఇప్పుడెందుకు అడ్డం తిరుగుతోంది..? కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే.. వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం మజ్లిస్ అలవాటు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి… అప్పట్లో కాంగ్రెస్తో ఉంది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది.. కాబట్టి.. బీజేపీకి అనుకూలంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో సైద్ధాంతికబంధం ఏమీ లేదు. బీజేపీకి లాభం కలిగేలా.. కాంగ్రెస్కు నష్టం కలిగేలా.. మైనార్టీ ఓట్లు కన్సాలిడేట్ కాకుండా ఓవైసీ ప్రయత్నం చేస్తున్నాు. ఈ ప్రయత్నంలో ఆయన దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. హైదరాబాద్ ఆయన పాతబస్తీ దాటి పోరు. కానీ.. యూపీ, మహారాష్ట్రకు వెళ్తారు
ఏపీలో ముస్లింలు ఓవైసీని గుర్తిస్తారా..?
ఆంధ్రప్రదేశ్లో ఓవైసీపీ ప్రభావం చూపించడం కష్టం. ఎందుకంటే… తెలంగాణ వేరు.. ఏపీ వేరు. తెలంగాణ నిజాం పాలనలో ఉన్న ప్రాంతం. నిజాం పాలనకు వ్యతిరేకంగా..అన్ని కులాలు, మతాలు పోరాడాయి. తెలంగాణలో మత కల్లోలాల చరిత్ర ఉంది. ఏపీలో ముస్లింలది భిన్నమైన చరిత్ర. భాషా పరంగా కూడా వారిది భిన్నం. హైదరాబాద్ లో హిందువులు కూడా ఉర్దూలో మాట్లాడతారు. కానీ… ఏపీలో ముస్లింలు కూడా తెలుగులో మాట్లాడుతారు. గుంటూరు జిల్లాలో హిందువులు, ముస్లింలకు తేడాలు చెప్పడం చాలా కష్టం. అలాంటి చోట మజ్లిస్ ప్రభావం చూపించడం సాధ్యం కాదు. మజ్లిస్ మద్దతు వల్ల జగన్ కు వచ్చే లాభం ఏమైనా ఉంటుందా అన్నది సందేహమే. టీడీపీ, కాంగ్రెస్ కూటమికి మైనార్టీ ఓట్లు తగ్గేలా మాత్రం ఓవైసీ చేయగలరు..!