జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పోటీకి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తరచూ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామనే ప్రకటనలు చేశారు. అయితే తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చినా పవన్ కల్యాణ్ పెద్దగా స్పందించడం లేదు. ఇటీవల తెలంగాణ నుంచి జనసేన కార్యకర్తలు.. పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లి పవన్ కల్యాణ్‌ను కలిశారు. పోటీ చేయాలన్న డిమాండ్ వినిపించారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం… పోటీ విషయంపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు. తెలంగాణలో పోటీకి తాము సిద్ధంగా ఉన్నామని.. పాతిక స్థానాల్లో అభ్యర్థులను కూడా గుర్తించినట్లు చెప్పారు. అయితే అనుకోకుండా ముందస్తు ఎన్నికలు వచ్చాయి.. పోటీ చేయలేకపోవచ్చు కానీ… మద్దతిచ్చే అవకాశం ఉందన్నట్లుగా చెప్పారు.
తెలంగాణలో అసలు జనసేనకు పార్టీ నిర్మాణం ఉందా..?
జనసేన అధినేత కొద్ది రోజుల కిందట.. కరీంనగర్ నుంచి ఖమ్మం వరకూ యాత్ర చేశారు. ఆ సమయంలో తాను పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు.. ఆకస్మాత్‌గా ఎన్నికలు వచ్చాయి కాబట్టి.. పోటీ చేయలేమన్నట్లుగా చెబుతున్నారు. నిజానికి ముందస్తు ఎన్నికలపై మూడు నెలల నుంచి చర్చ జరుగుతోంది. అది కూడా కాకుండా.. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా.. రాజకీయ పార్టీ సిద్ధంగా ఉండాలి. ఫలానా సమయంలో పెడతామని… మేము అనుకోలేదు… ప్రిపేర్ కాలేదు కాబట్టి.. పోటీ చేయలేమని చెబుతారా..? పోనీ.. ఇప్పట్నుంచి ప్రిపేర్ అయి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా..?. అందువల్ల… అది బేసిక్ పాయింట్ కాదు. దీని ప్రకారం చూస్తే.. తెలంగాణలో జనసేన పోటీ చేయడానికి ఆసక్తిగా లేదు. దీనికి కారణం ఏమిటంటే… ఏపీలోనే పార్టీ నిర్మాణం కొద్దిగా పూర్తి కాలేదు. తెలంగాణలో అసలే లేదు. ఏపీలో కూడా.. ఒకటి రెండు వారాలు రాజకీయ పర్యటనలు చేస్తారు.. తర్వాత రెండు, మూడు వారాలు… కార్యకలాపాలు ఉండవు. మిగతా పార్టీలు అలా ఉండవు. అందరూ ప్జల్లో ఉంటారు. దీన్ని బట్టి చూస్తే..ఏపీలోనూ జనసేన పూర్తి స్థాయిలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం లేదని చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఏపీలోనే జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది..!
పోటీ లేనట్లే.. ! మరి మద్దతు ఎవరికి..?
తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేయడం లేదని నిర్దారణ అయింది. అయితే మద్దతు ఇస్తామని మాత్రం చెబుతున్నారు. ఎవరికి మద్దతు ఇస్తారనేది ఓ ప్రశ్నగా మిలిగిపోయింది. ఏపీలో వామపక్షాలతో కలిసి జనసేన పని చేస్తోంది. రాజకీయ పోరాటాలు చేస్తున్నారు. అక్కడ వామపక్షాలతో పొత్తు పెట్టుకోవచ్చనే వార్తలు ఉన్నాయి. అందుకే తెలంగాణలో తమతో పొత్తు పెట్టుకోవాలని.. సీపీఎం నేతృత్వంలో బీఎల్ఎఫ్ కూటమి అడిగింది. కానీ పవన్ స్పందించలేదు. మరి ఏపీలో .. వామపక్షాలతో పొత్తు పెట్టుకుని… తెలంగాణలో వామపక్షాలకు మద్దతు ఇస్తారా లేదా..అన్నది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్నేమిటంటే.. పవన్ కల్యాణ్.. ఓ సారి ప్రగతి భవన్‌కు పోయి వచ్చిన తర్వాత కేసీఆర్ పాలనను పొగడటం ప్రారంభించారు. ఏపీలో పోల్చి.. తెలంగాణ పాలన మెరుగ్గా ఉందన్నారు. దీన్ని బట్టి చూస్తే టీఆర్ఎస్కు మద్దతిస్తారా..? అన్నది. తెలంగాణలో ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నా.. పవన్ కల్యామ్ మాత్రం ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. ఇక మూడోదేమిటంటే.. కొంత మంది రాజకీయ నేతలంటే..అభిమానం అని చెబుతూ ఉంటారు. జగ్గారెడ్డి, వీహెచ్ లాంటి నేతలు కాంగ్రెస్‌లో ఉన్నారు. వారున్నారు కాబట్టి కాంగ్రెస్‌కు మద్దతిస్తారా..? కాంగ్రెస్‌కు మద్దతిచ్చేపని అయితే.. ఆ కూటమిలో టీడీపీ ఉంది. ఏపీలో చంద్రబాబును, లోకేష్‌ను, టీడీపీని రోజూ విమర్శిస్తూ… తెలంగాణలో టీడీపీ కూటమిలో ఉన్న మహాకూటమికి మద్దతిస్తారా అన్నది సందేహం. అలా కాకుండా.. వ్యక్తులకు మద్దతిస్తారా అన్నది మరో సందేహం. సహజంగా రాజకీయ పార్టీ.. మరో రాజకీయ పార్టీకే మద్దతిస్తుంది. అలా కాకుండా.. తనకు నచ్చారంటూ.. ఐదుగురు టీఆర్ఎస్, నలుగురు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ, మరొకరు.. సీపీఐ వాళ్లకి మద్దతిస్తానంటే.. మనుగడ సాగించే రాజకీయాలు కాదు. అది సాధ్యం కాదు.
జనసేన పోటీ చేసి ఏం సాధిస్తుంది..?
తెలంగాణలో పోటీ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. కన్ఫ్యూజన్ కాదు కానీ.. ఆలోచనల్లో ఉన్నాననని చెప్పుకొచ్చారు. వాస్తవంగా… ఆలోచనలో కాదు కానీ.. కన్ఫ్యూజన్లో ఉన్నానని చెప్పాలి. ఎందుకంటే… బలం లేదు.. క్యాడర్ లేదు. తెలంగాణ ఆయన ప్రయారిటీ కాదు. ఏపీ రాజకీయాల్లోనే ఆయనకు ఆసక్తి ఉంది. నిజానికి ఇలాంటి సమయంలో తెలంగాణలో పోటీ చేస్తే.. ఎలాంటి ఓట్లు రాకపోతే.. ఆ ప్రభావం ఏపీపై పడుతుంది. కొద్దిగా ఓట్లు కూడా తెచ్చుకోలేదన్న విమర్శలు వస్తాయి. ఆ మాటకొస్తే వైసీపీ కూడా తెలంగాణ ఎన్నికల గురించి చర్చించడం లేదు. అసలు పోటీ చేస్తారా అన్న అంశంపై కూడా ఆ పార్టీ వారెవరూ…స్పందించడం లేదు. అంతకు ముందు ఖమ్మం ఎంపీ, మూడు ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు కూడా. అయినా వైసీపీ ఎందుకు ప్రస్తావన లేదు..?. అందుకే.. వైసీపీనే చేయకుండా.. జనసేన ఏం చేస్తుంది..?
ఎవరికి మద్దతిచ్చినా విమర్శలు ఖాయమేనా..?
తెలంగాణలో ఏం చేయాలన్నది.. పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు పెద్ద సమస్య. ఎవరికి మద్దతిచ్చినా ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. టీఆర్ఎస్ కు మద్దతిస్తే.. ఏపీలో… టీడీపీ విమర్శలు గుప్పిస్తారు. బీజేపీ ఆదేశాల మేరకే..టీఆర్ఎస్ కు మద్దతిచ్చారని విమర్శలు చేస్తారు. ఏపీ ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటారా… అని .. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏకిపడేస్తారు. అందువల్ల టీఆర్ఎస్కు మద్దతివ్వలేరు. మహాకూటమికి మద్దతివ్వలేరు. మహాకూటమిలో టీడీపీ ఉంది. ఒక వేళ ఇస్తే… వైసీపీ విమర్శలు చేస్తుంది. వీరిద్దరికి కాకుండా.. ఎవరికి మద్దతివ్వాలి. బీజేపీకి మద్దతివ్వలేరు. ఇక మిగిలింది.. బీఎల్ఎఫ్ కూటమి. ఇక్కడ ఆ కూటమి బలంగా లేదు. బలంగా లేని కూటమికి మద్దతిస్తారో లేదో తెలియదు. వీటన్నింటిని చూస్తే… పవన్ కల్యాణ్ ఎన్నికలకు దూరంగా ఉండటమే కాదు.. అసలు పట్టించుకోకుండా.. సైలెంట్‌గా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికలు పవన్ కల్యాణ్‌కు మాత్రం ఓ సవాలే.