పెద్ద నోట్లను నరేంద్రమోడీ రద్దు చేసి.. రెండేళ్లు అయిపోయింది. నోట్ల రద్దు లక్ష్యం నెరవేరుతోందని కేంద్రం చెబుతోంది. ఆ లక్ష్యం ఏమిటో మాత్రం చెప్పడం లేదు. బ్లాక్ మనీ మాత్రం.. పెద్ద నోట్ల రద్దు లక్ష్యం కాదని చెప్పుకొచ్చారు. దేశంలో ఉన్న నగదునంతటికి ఆర్థిక వ్యవస్థలోకి తీసుకు రావడానికే చేశామని కొత్త కారణం చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు చేసినప్పుడు చెప్పిన విషయం ఏమిటంటే.. రూ. వెయ్యి, రూ. ఐదు వందల నోట్ల రూపంలో ఉన్న నల్లధనాన్ని పెద్దలు దాచుకున్నారని… వాటన్నింటినీ వెలికి తీస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
నోట్ల రద్దు లక్ష్యం బ్లాక్‌మనీ కాదా..?
బ్యాంకుల్లో ఉన్న డబ్బుకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. లెక్కలు చెప్పలేని సొమ్మును.. బ్లాక్ మనీగా అక్రమార్కులు ఇంట్లో దాచుకుంటూ ఉంటారు. ఉదాహరణ.. ఓ అధికారో..మరో వ్యక్తో .. రూ. 2 కోట్ల లంచం తీసుకున్నాడనుకుందాం. ఆ సొమ్మును… బ్యాంకులో డిపాజిట్ చేయలేరు. చేస్తే లెక్కలు చెప్పాలి. అందుకే సడన్‌గా పెద్ద నోట్లను రద్దు చేశారు. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత.. ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న నగదును బ్యాంకుల్లో జమ చేస్తారు. అలా లెక్కల్లో లేని నల్లధనం.. జమ అయితే.. ఎక్కడి నుంచి వచ్చిందో.. ప్రభుత్వం తెలుసుకుంటుంది. నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో … పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు.. ఎంత మొత్తం నల్లధనం.. ఎంత వరకూ వెనక్కి రాదని భావిస్తున్నారని అని ప్రశ్నించింది. అప్పుడు ప్రభుత్వం రూ. మూడు లక్షల కోట్ల వరకూ బ్లాక్ మనీ ఉంటుంది. ఇవి బ్యాంకుకు తిరిగి రావని.. చెప్పింది. రూ. 15 లక్షల కోట్ల పెద్ద నోట్లు ఉంటే.. రూ. 12 లక్షల కోట్లు మాత్రమే వస్తాయని చెప్పుకొచ్చింది. కానీ.. రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం.. నోట్ల రద్దు చేసిన రోజు… దేశంలో ఉన్న పెద్ద నోట్ల విలువ రూ.15 లక్షల 41వేల కోట్లు. బ్యాంకుల్లో డిపాజిట్ చేయబడిన… రూ. 15 లక్షల 31వేల కోట్లు తిరిగి వచ్చాయి. అంటే..99.3 శాతం తిరిగి వచ్చాయి. భారత ఆర్థిక వ్యవస్థలో యాభై శాతం నల్లధనం ఉంటుందని నిపుణలు అంచనా వేస్తూంటే.. 0.7 శాతం మాత్రమే… వెనక్కి రాలేదు. ఈ మొత్తంలోనూ.. సమయానికి బ్యాంకుల్లో వేసుకోని వాళ్లు కూడా ఉన్నారు.
నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునే అవకాశం మోడీ ఇచ్చారా..?
నల్లధనంగా చెప్పుకునే ఈ రూ.పది వేల కోట్లను పట్టుకోవడానికి కోట్లాది మంది భారతీయుల్ని ఇబ్బందుల్లో పెట్టారు. దేశ ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోయింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమాలు ఘారంగా దెబ్బతిన్నాయి. అసంఘటిత రంగం మొత్తం కుదేలయంది. రూ. పది వేల కోట్ల నల్లధనం కోసమే.. ఇంత చేయడం అవసరమా..? ఇంత మనీ వెనక్కి వచ్చిన తర్వాత కేంద్రం మరో వాదన తీసుకు వచ్చింది. బ్యాంకుల్లో డిపాజిట్ అయినంత మాత్రాన.. అంతా న్యాయబద్ధమైన డబ్బులు కాదని.. అందులోనే నల్లధనం ఉంది. పట్టుకుంటామని కేంద్రం ప్రకటించింది. అది మాత్రం నిజమే. బ్యాంకుల్లో డిపాజిట్ అయినంత మాత్రాన వైట్ మనీ కాదు. కానీ.. డిమానిటైజేష్ అయిపోయి… దాదాపు రెండేళ్లు అవుతోంది. ఈ మధ్య కాలంలో ఎంత నల్లధనాన్ని పట్టుకున్నారు..?. ఎవర్ని పట్టుకున్నారు..? ఫలానా వాళ్లు.. బ్లాక్‌మనీ డిపాజిట్ చేశారని ఒక్కర్నైనా గుర్తించారా..? ఇంత వరకూ ఒక్కరిని కూడా కేంద్రం గుర్తించలేదు.అందుకే.. అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ చాలా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకోవడానికి… ప్రభుత్వం కల్పించిన చట్టబద్దమైన అవకాశం… నోట్ల రద్దుగా మారింది. దీన్నే మనీలాండరింగ్ అంటారు. రూ. 15 లక్షల 41 వేల కోట్లలో… రూ. 3 లక్షల కోట్లు బ్లాక్ మనీ ఉంటుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ రూ. 10వేల కోట్లు మాత్రమే వెనక్కి రాలేదు. అంటే.. మిగతా రూ. 2 లక్షల 90 వేల కోట్ల బ్లాక్‌మనీ.. బ్యాంకులకు చేరింది. అటు సుప్రీంకోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక.. ఆర్బీఐ రిపోర్ట్.. ప్రకారం.. చూస్తే… రూ. 2 లక్షల 90 వేల కోట్లను.. నోట్ల రద్దు వల్ల వైట్ మనీగా మార్చుకున్నారు.
నల్ల కుబేరులకు మనీ లాండరింగ్ చేసుకునే చాన్సిచ్చారా..?
నోట్ల రద్దు సమయంలో ఇంకో మాట ఏం చెప్పారు… ఎక్కువగా నగదు చెలామణి ఉండటం వల్ల.. ప్రజలు ఎక్కువగా నగదు రూపంలో.. లావాదేవీలు నిర్వహించడం వల్ల నల్లధనం పెరిగిందని.. కేంద్రం వాదించింది. అందుకే… నగదు చెలామణిని తగ్గించడానికి నోట్ల రద్దు చేశామని చెప్పుకొచ్చారు. విచిత్రం ఏమిటంటే… పెద్దనోట్లు రద్దు చేసినప్పుడు.. భారతదేశంలో రూ. 15 లక్షల 41 వేల కోట్లు నగదు చెలామణి ఉంది. ఇది మొత్తం నగదు చెలామణిలో 86 శాతం. ఇప్పుడు ఆర్బీఐ వార్షిక నివేదిక చెప్పిదేమిటంటే.. రూ. 18 లక్షలకు కోట్లకుపై ఇప్పుడు నగదు సర్క్యులేషన్ లో ఉంది. అంటే.. నోట్ల రద్దు ముందు కన్నా.. ఎప్పుడే ఎక్కువ నోట్లు చెలామణిలో ఉన్నాయి. నగదు చెలామణి తగ్గిస్తామని నోట్లు రద్దు చేస్తే.. ఆది కాస్తా.. ఇవాళ ఎక్కవయింది. అంటే.. బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా పెద్ద నోట్ల రూపంలో బ్లాక్‌మనీని దాచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు.
రూ. 2 వేల నోట్లతో మళ్లీ నల్ల కుబేరులకు అవకాశం ఇచ్చారా..?
భారతదేశంలో ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న నగదులో 37 శాతం రూ.2వేల రూపాయల నోట్లే. ఐదు వందల రూపాయల నోట్లు 47 శాతం. అంటే.. ఇండియాలో సర్క్యులేషన్లో ఉన్న నోట్లలో 90 శాతం పెద్ద నోట్లే. నోట్ల రద్దు చేసినప్పుడు.. నల్లధనం ఉన్న వాళ్లు.. క్యాష్ రూపంలో డబ్బులు దాచుకుంటారు కాబట్టి.. వాటిని రద్దు చేస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చేశారు. బ్లాక్‌మనీని వైట్ చేసుకోవడానికి.. అలాగే బ్లాక్‌మనీని దాచుకోవడానికి చాన్సిచ్చినట్లు… తేలిపోయింది. ఈ విషయాన్ని ఆర్బీఐ నివేదికే చెబుతోంది. నోట్ల రద్దు అనేది సామాన్యుల కోసం అని చెప్పారు. కానీ.. ఆర్బీఐ రిపోర్ట్‌ను చూసిన తర్వాత నల్లధనం ఉన్న వారి కోసమే నోట్లు రద్దు చేశారని స్పష్టమయింది.