సీబీఐ వర్సెస్ బెంగాల్ పోలీస్ గా జరిగిన రాజకీయ వ్యవహారాలు … మోడీ వర్సెస్ మమతాగా మారాయి. దీనిపై దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని పార్టీలు స్పందించాయి. ఎక్కువగా విపక్ష పార్టీలు స్పందించాయి. కేంద్ర ప్రభుత్వం సీబీఐని ఉపయోగించి… ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేస్తోందని మండిపడ్డారు. మమతా బెనర్జీ దీక్షకు మద్దతు ప్రకటించారు. అయితే.. తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. ఈ రెండు పార్టీలు మాత్రమే ఎందుకు సైలెంట్‌గా ఉన్నాయి…?
బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి జగన్ సిద్ధంగా లేరు…!
దేశంలో ఫెడరల్ ఫ్రంట్ అవసరం ఉందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదే పదే చెబుతూంటారు. అందు కోసం కొన్ని పర్యటనలు జరిపారు. మమతా బెనర్జీతోనూ సమావేశమయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనూ కేటీఆర్ చర్చలు జరిపారు. అయినప్పటికీ.. ఈ రెండు పార్టీలు.. మమతా బెనర్జీ దీక్షపై స్పందించకపోవడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. ప్రతిపక్షాల పోరాటంలో.. చంద్రబాబునాయుడు కీలకంగా ఉన్నారు. బీజేపీయేతర పార్టీల్లో… తన వాయిస్‌ని గట్టిగా వినిపిస్తున్న నేత చంద్రబాబునాయుడు. ఆయన ఆ పార్టీల వ్యవహారాల్లో కీలకంగా ఉన్నందున… వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సహజంగానే స్పందించరు. చంద్రబాబు ఉనికి లేని కూటమి వైపు ఆయన చూసే అవకాశం ఉంది. సహజంగా ఆయన కాంగ్రెస్ పార్టీతో దూరంగా ఉండాలనుకుంటున్నారు. బీజేపీ వ్యతిరేక రాజకీయ కార్యకలాపాల్లో జగన్.. ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడూ పాల్గొనలేదు. వైసీపీ విధానం.. మొదటి నుంచి బీజేపీకి అనుకూలంగా ఉంది.
ఫెడరల్ ఫ్రంట్ పెట్టిన కేసీఆర్ కచ్చితంగా స్పందించాలి..!
ఫెడరల్ ఫ్రంట్ లో కేసీఆర్ భాగస్వామి. ఆయన రాష్ట్రాల హక్కుల కోసం.. ఈ ఫ్రంట్‌ను పెడుతున్నట్లు గా చెప్పారు. అలాంటి సమయంలో.. కోల్‌కతా పరిణామాలపై కచ్చితంగా స్పందించాల్సింది. ఎందుకంటే.. మమతా బెనర్జీ సీబీఐని ఉపయోగించుకుని.. తమ రాష్ట్రంపై దాడి చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. అలాంటప్పుడు… ఈ విషయంపై కచ్చితంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సింది. శారదా చిట్ ఫండ్ స్కాం విషయంలో.. సీబీఐ చర్యలు కరెక్ట్‌గా ఉంటే.. అదే చెప్పాలి.. లేదా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారని భావిస్తే మద్దతు ప్రకటించాలి. లేదంటే.. మోడీ, దీదీ ఇద్దరూ కలిసి నాటకాలేస్తున్నారని భావిస్తే.. అదైనా చెప్పాలి. కానీ.. ఏమీ చెప్పకుండా.. మౌనంగా ఉంటే… ఓ రాజకీయ పార్టీకి.. ఓ భారీ రాజకీయ పరిణామాలకు సంబంధం లేదనుకుంటే ఎలా..?. కచ్చితంగా.. కేసీఆర్ స్పందించాలి..!. కానీ ఎందుకు స్పందించడం లేదు..?
బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం ఇష్టం లేకనే స్పందించలేదా..?
కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదన్న కీలక అంశం. గతంలో… విపక్ష పార్టీలన్నీ.. ఒకే మీదకు వచ్చినప్పుడు… కేసీఆర్ ఎప్పుడూ వెళ్లలేదు. కుమారస్వామి ప్రమాణస్వీకారంకు వెళ్లలేదు. కానీ ఒక రోజు ముందు వెళ్లి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. ఆ తర్వాత కోల్‌కతా సభకు.. మమతా బెనర్జీ పిలిచినా వెళ్లలేదు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ నేతలు స్టేజి మీద ఉన్నారని చెప్పుకున్నారు. మరి ఇప్పుడు మమతా బెనర్జీ చేస్తున్న దీక్షకు కాంగ్రెస్ మద్దతు లేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్లలేదు. అయినా… కేసీఆర్ వెళ్లలేదు. కనీసం ఇక్కడ్నుంచి కూడా మద్దతు ప్రకటించలేదు. అంటే.. అర్థం ఏమిటి.. మోడీపై ఎవరైనా పోరాడితే… మద్దతివ్వడానికి కేసీఆర్ సిద్ధంగా లేరని…!. ఒక్క మమతా బెనర్జీ మాత్రమే కాదు.. గతంలో కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించలేదు. గతంలో లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో కేజ్రీవాల్ దీక్ష చేస్తే.. ఆ సమయంలో ఢిల్లీలో ఉన్నప్పటికీ కేసీఆర్ మద్దతు ప్రకటించలేదు. కేజ్రీవాల్ మొదటి నుంచి కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇదొక్కటే కాదు 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు, జీఎస్టీ లాంటి అంశాలపై.. కేంద్రంపై ఫెడరల్ స్ఫూర్తితో పోరాడుతున్న సందర్భాల్లో కేసీఆర్… కలవలేదు. వ్యవస్థల్ని మోదీ నాశనం చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో అయినా కలవాలి కదా..!
సైలెంట్‌గా ఉండే ఫెడరల్ ఫ్రంట్‌కు విలువ ఉంటుందా..?
కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి. ఆ పార్టీ ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ.. ప్రమేయం పార్టీల్లో కానీ.. రాజకీయాల్లో కానీ..టీఆర్ఎస్ సానుకూల వైఖరి తీసుకోలేదు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉంటానంటూ… కాంగ్రెస్‌కు సంబంధం లేని విషయాల్లో మాత్రం.. ఎందుకు స్పందించడం లేదనేదానికి సమాధానం లేదు. మమతా బెనర్జీ విషయంలో… అదే జరుగుతోంది. ఏదో ఓ అభిప్రాయం కచ్చితంగా చెప్పాల్సి ఉంది. రాష్ట్రాల హక్కుల కోసం.. పోరాటం అంటూ.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి.. అదే రాష్ట్రాల హక్కులకు భంగం కలుగుతుందని.. ఓ వైపు గగ్గోలు పెడుతూంటే.. స్పందించకపోవడం కరెక్ట్ కాదు.. !