హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో పాల్గొన్న ‘యువభేరి’లో ప్రత్యేక హోదాపై ప్రసంగించిన ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రసాదరెడ్డి యువభేరి సదస్సుకు హాజరయిన విషయాన్ని మానవ వనరులశాఖ అధికారులు సంబంధింత మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్ళారు. ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేయాలని మంత్రి గంటా ఆంధ్రా విశ్వవిద్యాలయ అధికారులను ఆదేశించారు. దీనిపై ప్రసాదరెడ్డి స్పందిస్తూ, ఇది తన హక్కులు కాలరాయటమేనని అన్నారు.
ప్రొఫెసర్ సస్పెన్షన్ నిర్ణయం ఏకపక్షంగా ఉందన్న వాదనలో పస లేకపోలేదు. ఆ ప్రొఫెసర్ ఆ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విమర్శలు చేసిన మాట వాస్తవమే. అయితే ఒక ప్రభుత్వోద్యోగి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది నేరమే అవుతుంది. కానీ ప్రొఫెసర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారు. యూనివర్సిటీలవంటి ఉన్నతవిద్యాసంస్థలు ప్రభుత్వనిధులతో నడిచినాగానీ అవి ప్రభుత్వసంస్థలు కాదని సుప్రీమ్ కోర్టే తీర్పు చెప్పింది. గతంలోకూడా ఎంతోమంది తెలుగు ప్రొఫెసర్లు శాసన మండలిలో, రాజ్యసభలో వివిధ పార్టీల తరపున సభ్యులుగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ జేఏసీకి ఇప్పటికీ కన్వీనర్‌గా ఉన్నారు. ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ప్రొఫెసర్ లక్ష్మన్న తెలుగుదేశం తరపున రాజ్యసభ సభ్యులుగా వ్యవహరించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలుగుదేశం తరపున ఎన్నికై ఎమ్ఎల్సీగా పనిచేశారు. బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషి బెనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహెబ్‌సింగ్ వర్మ తన పూర్వాశ్రమంలో ఢిల్లీ యూనివర్సిటీలో లైబ్రేరియన్‌గా పనిచేశారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ మసాషుసెట్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న నోమ్ చామ్స్కీ అమెరికా సామ్రాజ్యవాదాన్ని విమర్శిస్తూ అనేక పుస్తకాలు రాశారు. కాబట్టి ప్రొఫెసర్లకు భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది. వారు ప్రభుత్వ విధానాలను విమర్శించొచ్చు. ఆయితే తమ పదవిని ఒకపార్టీకి బాకా ఊదటానికి, ఒక పార్టీకి అనుబంధంగా ఉండి మరో పార్టీని విమర్శించటానికి ఉపయోగిస్తే అది ఖచ్చితంగా నేరమే.
ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తేమాత్రం అతనిని సస్పెండ్ చేయటం తప్పేమీ కాదు. ప్రసాదరెడ్డి గతంలో వైఎస్ విగ్రహాన్ని ఏయూ క్యాంపస్‌లో ప్రతిష్ఠించటానికి ప్రయత్నించి విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా జగన్ యువభేరి వెనకకూడా ఈయన కీలకపాత్ర పోషించినట్లు సమాచారం.