బాహుబలిలో ఓ సామ్రాజ్యాన్నే సృష్టించాడు రాజమౌళి. ఇప్పుడు అదే బాటలో వెళ్తున్నాడు నాగ అశ్విన్. `ప్రాజెక్ట్ కె` కోసం ఓ ఆర్మీని పుట్టిస్తున్నాడు. ప్రభాస్ – నాగ అశ్విన్ ల కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రం `ప్రాజెక్ట్ కె`. ఇదో విభిన్నమైన జోనర్లో రూపుదిద్దుకొంటున్న సినిమా. ఆ జోనర్ ఏమిటన్నది చిత్రబృందం క్లియర్‌గా చెప్పడం లేదు. కాకపోతే.. నాగ అశ్విన్ చేస్తున్న హంగామా చూస్తుంటే.. అదేదో కనీ వినీ ఎరుగని రీతిలో ఉండబోతోందని తెలుస్తూనే ఉంది.
ప్రభాస్ ఎంతమందినైనా పిండి చేయగల సామర్థ్యం ఉన్న హీరో. తన కటౌట్ అలాంటిది. ప్రభాస్ రంగంలోకి దిగితే… కొండలైనా పిండి అయిపోతాయి. అలాంటి ప్రభాస్‌ని ఎదిరించే విలన్ గ్యాంగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి? అందుకనే `రైడర్స్`ని సృష్టిస్తున్నాడు నాగ అశ్విన్. రైడర్స్ అంటే.. విలన్ కి ఉండే ప్రైవేటు సైన్యం. అందరూ ఒకేలా, ఒకే తరహా శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఒకేలాంటి దుస్తులు, ఒకేలాంటి ఆయుధాలు ధరించి ఉంటారు. వాళ్లని ప్రభాస్ ఎదుర్కోవాలన్న మాట. వందలాది మంది రైడర్స్ తో ప్రభాస్ చేసే యాక్షన్ సీక్వెన్స్ అబ్బురపరిచేలా ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఈ రైడర్స్ ని తయారు చేసే పనిలో ఉంది చిత్రబృందం. వాటికి సంబంధించిన వీడియో ఒకటి వదిలారు. ఈ వీడియో చూస్తే.. వెండి తెరపై నభూతో.. న భవిష్యత్ అనుకొనే ఫైట్ సీక్వెన్స్ చూడబోతున్నామన్న నమ్మకం మరింత ఎక్కువవుతోంది.