ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబినేషన్లో ప్రాజెక్ట్ కె రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏ జోనర్లో ఉండబోతోందన్న విషయాన్ని చిత్రబృందం స్పష్టంగా చెప్పడం లేదు. కాకపోతే… సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, మైథాలజీ… ఇలా చాలా రకాల జోనర్లు మిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ జోనర్లో చాలా సన్నివేశాలు సాగబోతున్నాయట.
భూమిని పోలిన మరో గ్రహంఉందా? మానవాళి… అక్కడ నివసించగలదా? అనే విషయమై చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకవేళ భూమి అంతరించిపోతే, మరో గ్రహంలో జీవినం సాగించగలమా? అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ సినిమాలో భూమిన పోలిన మరో గ్రహాన్ని చూపించే ప్రయత్నం జరగబోతున్నట్టు టాక్. అక్కడ విచిత్రమైన పరిస్థితుల్ని సైతం.. తెరపై చూపించబోతున్నార్ట. ఇప్పటి వరకూ వెండి తెరపై ఇలాంటి జోనర్ సినిమా రాలేదని చిత్రబృందం గట్టిగా చెబుతోంది. ఈ సినిమాపై వస్తున్న లీకుల్ని బట్టి చూస్తే అది నిజమే అని అనిపిస్తోంది కూడా. అంతర్జాతీయ స్థాయిలో, ఆ ప్రమాణాలతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇంగ్లీష్ వెర్షన్ ని సైతం నేరుగా విడుదల చేసే ఆలోచన ఉంది. అందుకే ఈ తరహా సబ్జెక్ట్ ని ఎంచుకొన్నాడు నాగ అశ్విన్. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రధారి.