లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతూండంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రాజెక్ట్ వార్ ప్రారంభించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వేగంగా కోలుకుని పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించడానికి బీఆర్ఎస్ కృష్ణా ప్రాజెక్టుల అంశాన్ని అందుకుంది. కాంగ్రెస్ పోటీగా చలో మేడిగడ్డ కు పిలుపునిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపంపై ప్రభుత్వం ఛలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12తో ముగియనున్నాయి. 12న అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల, చర్చకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
13వ తేదీన బీఆర్ఎస్ నల్గొండలో బహిరంగ సభ నిర్వహించనుంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్ వద్ద నార్కట్ పల్లి -అద్దంకి హైవేకి ఆనుకునిఉన్న విశాలమైన స్థలంలో సభను నిర్వహించాలని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. భారీగా జన సమీకరణ చేసి సత్తా చాటాలనుకుంటున్నారు. గత ఎన్నికల్లో నల్లగొండలో బీఆర్ఎస్ పరువు పోయేలా పరాజయం ఎదురయింది.
బీఆర్ఎస్ బహిరంగ సభ తలపెట్టిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తేదీని ఖరారు చేసింది. దీంతో తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రాజెక్టుల అంశంపై రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయికి చేరినట్లయింది. ఈ రాజకీయంలో బీజేపీ వెనుకబడిపోయింది.