వరస విజయాలతో రాజకీయ ఫిరాయింపుల ఏకైకీకరణతో వూపు మీదున్న కెసిఆర్ ప్రభుత్వం తన జనాదరణను చాటుకోవడానికి తెలంగాణ రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవం ఒక సందర్భంగా చేసుకోవడం సహజం. కరెంటు కోతలు లేకపోవడం బాగా కనిపిస్తున్న ఒక విజయం.
సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిచ్చామన్నది ప్రదాన ప్రచారం. నా వరకు నేను విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెట్టడం, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంటు చేస్తామనే ప్రకటన వీటిని బాగా హర్షిస్తాను. అయితే అవీ పాక్షికంగానే అమలవుతున్నాయి.(కాలేజీ పిల్లలకు కూడా అదే బియ్యం సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కొత్తగా ప్రకటించారు) కార్పొరేషన్లలో వారిని పర్మనెంటు చేసే సూచనలు లేవు. సమ్మెలు పోరాటాలు సాగుతూనే వున్నాయి. నీళ్లు నిధులు నియామకాలు అనేది అప్పుడూ ఇప్పుడూ తమ కీలక ఎజెండా అంటారు కెసిఆర్.గత ఏడాది జూన్ 2న ప్రసంగంలో 25 వేల ఉద్యోగాలు ఇస్తామని చెబితే అందులో అయిదో వంతు మాత్రమే పూర్తయ్యాయని హిందూ కథనం. నీళ్లకు సంబంధించి రీడిజైనింగ్ పవర్ పాయింట్లు ఎలా వున్నా ఇచ్చామంటున్న నిధులతోనైనా మూడేళ్లలో పూర్తయ్యే అవకాశం లేదని ఆ పార్టీ ఎంఎల్ఎ ఒకరు నాతో అన్నారు. నిజంగా 25 వేల కోట్లు పూర్తిగా సమర్థంగా ఖర్చు చేసినా కాళేశ్వరం వంటివి అనుకున్న సమయంలో పూర్తి కావని నిలదీయలేని ప్రతిపక్షాలకు ఆయన తప్పు పట్టారు. ఈ ప్రాజెక్టుల విషయంలో ఎగువ రాష్ట్రాలతో చర్చించినట్టే సోదర తెలుగు రాష్ట్రంతోనూ పరిష్కరించుకోవవలసింది. కనీసం ముఖాముఖి చెప్పవలసింది. మాట్లాడాలని కోరుతున్నాము అంటారుగాని ఆ దిశలో అడుగులు పడటం లేదు. వేల టిఎంసిలు సముద్రంలో వృథాగా కలిసిపోతున్నాయనే ఆయన వాదన నిజమే గాని వాటిపై మళ్లీ ప్రాజెక్టులు తలపెడితే ఎగువ రాష్ట్రాలు ఏమంటాయన్న సమస్య వుంటనే వుంటుంది.
డబుల్ బెడ్రూం లక్షల్లో కడతామంటున్నప్పుడు దానికి కావలసిన కేటాయింపులు స్థలాలు టెందర్లు రేట్ల ఖరారు ఏదీ పూర్తి కాలేవు. ఎర్రవెల్లిలో మోడల్హౌస్ షో కేసింగు మాత్రమే. లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటే వేల సంఖ్యలో కూడా నిర్మాణంచేసే పరిస్తితి లేనప్పుడు డబుల్ బెడ్రూంలపై ట్రిబుల్ ప్రచారం ఇప్పటికి బబుల్ మాత్రమే! భారీ నిర్మాణాల కాంట్రాక్టులలో అత్యధిక లాభాలు వచ్చినట్టు ఈ ఇళ్లలో రావు గనక చిన్నవారికి అవకాశమిస్తామన్నారు. రాష్ట్రాలు రెండైనాపార్టీలు వేరైనా కాంట్రాక్టర్లు వ్యాపారవేత్తల మాటే చెల్లుతుందనడానికి ఇదో ఉదాహరణగా కనిపిస్తుంది. కెసిఆర్ చుట్టూ వుండే సన్నిహితులు కూడా దీనిపై కొన్ని ప్రత్యామ్నాయ సూచనలు చేసినా ఆయన పెద్ద స్పందించలేని సమాచారం.
కెజిటుపిజి, దళితులకు భూమి ఇంకా అమలులోకి రాలేదని అధికారికంగానే చెబుతున్నారు. భూ సమస్యను రంగం మీదకు తెచ్చిన తెలంగాణలో భూపంపిణీ చేయలేకపోవడం విడ్డూరమే . భూములు కొని పంచడం అన్న విధానం అనేక అవకవతకలకు దారి తీస్తున్నట్టు వార్తలున్నాయి. ఈ విషయంలో కొందరు దళారులు కూడా బయిటుదేరుతున్నారు. ప్రాజెక్టుల కోసం .భూసేకరణపై జీవో 123 ఇంకా దారుణంగా వుంది. 2013 భూ సేకరణ బిల్లు నిబంధనల నుంచి బయిటపడటానికి అవకాశమిస్తుంది. సిర్పూర్ కాగజ్ నగర్ మిల్లువంటి వాటిపై ఉద్యమ కాలంలో చాలా చర్చ జరిగింది గాని ఇప్పుడు మూత పడితే తెరిపించే చర్యలు నాస్తి. కార్మిక సమస్యల పరిష్కారం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.విద్యారంగంలో గందరగోళం గురించి ఎంత తక్కువ చెవితే అంత మేలు. పేదలు ఎస్సిఎస్టి బిసి మైనార్టి వర్గాలు అదికంగా వుండే తెలంగాణలో సామాజిక న్యాయం అన్నది ప్రభుత్వ ఎజెండాలో పెద్దగా వినిపించకపోవడం యాదృచ్చికం కాదు. మహిళలకు మంత్రివర్గంలో చోటు లేదని విమర్శలు ఎంతగా వున్నా ఇప్పట్లో మారే అవకాశం లేదని తేల్పిపారేశారు. ఎందుకంటే విస్తరణ అనసరమైన తతంగమని చెప్పడం ద్వారా పదవుల ఆశలపై నీళ్లుచల్లేశారు. వీరతెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని స్మరించుకోవడానికి సిద్ధపడని ప్రభుత్వాధినేత తాత్వికత, సనాతన విశ్వాసాలు సమానతకు అడ్డుపడుతున్నాయా? అని సందేహం కలుగుతుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో వేదికగా ముందు నిలిచిన జెఎసిని కలుపుకోవడం కూడా అనవసరమనేంత ఏకపక్ష ధోరణి పెరిగింది. ఉద్యమానికి వూపిరిగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీకి వూతం ఉపశమనం లేకపోగా ఉద్రిక్తత పెరుగుతున్నది. మీడియాలో విమర్శల పట్ల స్వతంత్రంగా మాట్లాడే మేధావుల పట్ట కూడా విముఖత బాగా కనిపిస్తుంది. ప్రతిపక్ష నేతల ముందస్తు అరెస్టులు సభలకు అనుమతి నిరాకరణలూ ఒకటి రెండుఎన్కౌంటర్లు ఇవన్నీ ప్రతికూల సంకేతాలు సమస్యలపై మాట్లాడేందుకు అపాయింట్మెంట్ రాలేదని ప్రతిపక్ష నేతలు అనడం ఒకటైతే స్వపక్ష నేతలే గోడుమంటున్నారు.
.కెసిఆర్ మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలలో . ఇప్పుడిప్పుడే ఆయన జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పడం గురించి మాట్లాడుతున్నారు గాని ా బిజెపి పట్ల తన విధానమేమిటో ఇంతవరకూ చెప్పింది లేదు. ఎన్డిఎలో చేరడానికి ఇంతవరకూ దరఖాస్తు చేసుకోలేదని బిజెపి అద్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానిస్తే కెసిఆర్ రాజకీయంగా స్పందించలేదు. తెలంగాణకు సహాయం చేయకపోవడం గురించి మాత్రమే మాట్లాడారు.
ఉద్యమ నాయకుడుగా ప్రభుత్వాధినేతగా కెసిఆర్ ముద్ర చాలా బలమైందనడంలో సందేహం లేదు. అయితే ఆయన పాలన విజయాల విషయం మాత్రం ఇంకా ప్రొజెక్షన్స్ స్థాయిలో వుంది. ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడి వుండొచ్చు గాని రాజకీయ నేతలు పార్టీలు ప్రజలకు కొత్తకాదు. కనుక వాగ్డానాల ఆధారంగా గాక వాస్తవాల ప్రకారమే వారు నిర్ధారణకు వస్తారు. అది తేలాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. కొత్త రాష్ట్రం గనకనే అందరినీ కలుపుకొని పోవడం మరింత అవసరమూ అవుతుంది.