ఇళ్ల కొనుగోలుదారులకు భద్రత, రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేశారు. రెరాలో నమోదు చేసుకున్న రియల్ ప్రాజెక్టుల్లో ఇళ్లను కొనుగోలు చేస్తే కొనుగోలుదారుల పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుంది. రెరా చెబుతోంది. నిర్మాణరంగ సంస్థలు సకాలంలో ఇంటిని అప్పగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో రెరా కీలక పాత్ర పోషిస్తోంది. నిబంధనలను పాటించే రియల్ ప్రాజెక్టులకే రెరా అనుమతులు ఇస్తోంది. నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే ఆయా రియాల్టీ, నిర్మాణరంగ సంస్థలపై కేసులు నమోదు చేయడంతో పాటు, భారీ జరిమానాలు విధించే అధికారం రెరాకు ఉంది.
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోని ప్రాజెక్టుల్లో ఎలాంటి కొనుగోళ్లు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. రెరా వద్ద రిజిస్ట్రేషన్ అయిన అన్ని స్థిరాస్తి ప్రాజెక్టుల వివరాలు రెరా వెబ్సైట్లో నమోదై ఉంటాయి. కొనుగోలుదారులు ఎవరైనా అయా ప్రాజెక్టుల వివరాలను rerait.telangana.gov.in వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో మోసపోతే జీవితాంతం సంపాదించినదంతా నష్టపోతారు. అందుకే \రెరాతో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులు పొందిన ప్లాట్లను, అపార్ట్ మెంట్లను, విల్లాలను మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు సలహాలిస్తున్నారు.
రేరాలో నమోదు చేసుకోకుండా స్థిరాస్తి అమ్మకాలు జరిపితే సదరు సంస్థపై అథారిటీ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. అంతే కాకుండా ఇల్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు చేసినప్పుడు.. సదరు నిర్మాణ సంస్థ లిఖితపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా, గడువు సమయంలో ఇంటిని అప్పగించకపోయినా రెరా ఆ బిల్డర్ కు జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఓ రకంగా రెరా రక్షణ గా ఉంటుందని అనుకోవచ్చు.