కేంద్ర ఉపరితల రవాణాశాఖా మంత్రి నితిన్ గడ్కారి ఈరోజు విశాఖపట్నం వచ్చారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వం చేపట్టిన సాగరమాల పధకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.8400 కోట్లు మంజూరు చేశాము. దానిలో రూ.3,000 కోట్ల ఖర్చు చేసి కాకినాడలో ఎల్.ఎన్.జి. టెర్మినల్, రూ.150 కోట్లతో కోస్టల్ ఫుడ్ ఎక్స్ పోర్ట్ జోన్ నిర్మించబోతున్నాము. విశాఖలో రూ.100 కోట్లతో ఆయిల్ జెట్టీ నిర్మిస్తున్నాము. అవిగాక మచిలీపట్నం, వాడ్రేవు పోర్టులని నిర్మించబోతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంది,” అని అన్నారు.
విశాఖలో ఏర్పాటు అవుతున్న ఏపి మెడ్ టెక్ జోన్ కోసం కేంద్రప్రభుత్వం రూ.175 కోట్లు మంజూరు చేసింది. దాని శంకుస్థాపనకే నితిన్ గడ్కారీ ఈరోజు విశాఖపట్నం వచ్చారు. గతంలో అయన ఓసారి రాష్ట్రానికి వచ్చినప్పుడు విజయవాడ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులని ప్రారంభిస్తూ, దాని నిర్మాణంతో సహా రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి కోసం, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాలని అమరావతితో అనుసంధానిస్తూ ఆరు లైన్ల రోడ్ల నిర్మాణం, అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం రూ.80,000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు ఆయన చెప్పిన వాటితో కలిపి చూస్తే అది మొత్తం రూ.90,175 కోట్లు అవుతోంది. అంటే చాలా బారీ మొత్తమేనని స్పష్టం అవుతోంది. ఇది కాక రాష్ట్రంలో ఆరు ఉన్నత విద్యాసంస్థలు, అంతర్వేదిలో డ్రెడ్జింగ్ కార్పోరేషన్, అనంతపురంలో బెల్ సంస్థల ఏర్పాటుకి చాలా బారీగా ఖర్చు అవుటుంది. వాటికీ కేంద్రప్రభుత్వమే నిధులు విడుదల చేస్తోంది.
రాజధాని, పోలవరం నిర్మాణం, రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ఏటా నిధులు విడుదల చేస్తూనే ఉంది. ఈ రెండేళ్లలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి రూ.సుమారు 1.40 లక్షల కోట్లు మంజూరు చేసినట్లు చెపుతుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత మంజూరు అవలేదని వాదిస్తోంది. కానీ ఈ లెక్కలన్నీ చూస్తే కేంద్రప్రభుత్వం కనీసం రూ.1లక్ష కోట్లు పైనే విడుదల చేసినట్లు అర్ధం అవుతోంది. ఆ మొత్తం ఒకేసారి ఇవ్వకుండా పనులని బట్టి దశలవారిగా నిధులు విడుదల చేస్తునందున కేంద్రప్రభుత్వం ఇంతవరకు ఎంత విడుదల చేసిందో తెలియడం లేదు. అందుకే ఇక నుంచి కేంద్రప్రభుత్వం విడుదల చేసే నిధులని రాష్ట్ర బడ్జెట్ లో కూడా వేరేగా చూపాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలని ఆదేశించింది.