మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఇంటి ముందు…సీఆర్పీఎఫ్ జవాన్లు, ఐటీ అధికారుల వాహనాలు ఇంకా భారీగానే ఉన్నాయి. ఇప్పటికి ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించి నాలుగు రోజులయింది. ఇంత సుదీర్ఘంగా ఐటీ సోదాలు జరపడం.. ఇటీవలి కాలంలో ఎక్కడా జరగలేదు. తీగ లాగే కొద్దీ.. బయటకు వస్తున్న విషయాల విశ్లేషణలకు సమయం తీసుకుంటుందని..అలాంటి సందర్భాల్లోనే… సోదాలు ఆలస్యమవుతాయని… ఐటీ విషయాల్లో నిపుణులైన వాళ్లు చెబుతున్నారు. ఐటీ సోదాల్లో ఏం వెలుగు చూశాయనే విషయం.. జాతీయ మీడియాకు… లీక్ అవుతోంది. దాంతో.. మేఘా కృష్ణారెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న పెద్దల్లో టెన్షన్ ప్రారంభమయిందని చెబుతున్నారు.
ఓ రాజకీయ పార్టీకి రూ. వందకోట్లను మేఘా కృష్ణారెడ్డి ఇచ్చినట్లుగా ఓ మీడియా సంస్థ ప్రకటించింది. అలాగే.. ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్ట్ విషయంలో… జరిగిన గూడుపుఠాణి వ్యవహారం బయటకు వచ్చిందని మరో మీడియా సంస్థ ప్రకటించింది. ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ ఉన్న కథనాలేనని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిజానికి.. మేఘా కృష్ణారెడ్డిపై ఐటీ దాడుల అంశాన్ని ఏ ఒక్క మీడియా సంస్థ కూడా ఫాలో అప్ చేయడం లేదు. దాంతో.. సాధారణ ప్రజలకు అసలు ఐటీ దాడులు జరుగుతున్నాయా.. లేదా అన్నదానిపై క్లారిటీ లేకుండా పోయింది. అడపాదడపా.. ఇంగ్లిష్ మీడియా ప్రకటించే వివరాలే.. అతి కొద్ది మందికి చేరుతున్నాయి.
మేఘా కృష్ణారెడ్డి.. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే.. ఆయన ఇంట్లో సోదాలు అంటే.. ఏ రాజకీయ పార్టీ నేతలు కూడా.. స్పందించలేదు. దాదాపుగా అందరూ సైలెంటయిపోయారు. ఆయన ఇంట్లో దొరికే గుట్టూ.. ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా ఉండదని.. అందరికీ అంటుకుంటుందనే చర్చ.. సాధారణంగా రాజకీయవర్గాలోనే జరుగుతోంది. దీంతో.. అసలు ఐటీ అధికారులు ఇంత కాలం ఏం సోదాలు చేశారు..? ఏం దొరికింది..? అందులో అవకతవకలేమిటన్నదానిపై ఐటీ అధికారులు అధికారికంగా ప్రకటన చేస్తేనే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు.