వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో కోట్లలో విరాళాలిచ్చినవారికి పెద్ద పీట దక్కింది. టిక్కెట్లు పొందడమే కాదు.. వారిలో చాలా మంది గెలిచి చట్టసభలకు వెళ్తున్నారు కూడా. వీరిలో అతి ముఖ్యుడు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. వైసీపీకి 2018-19లో మొత్తం రూ.80.57 కోట్ల విరాళాలు వస్తే ఇందులో రూ. పదకొండు కోట్ల రూపాయలు ఆయన ఒక్కటే ఇచ్చారు. వ్యక్తిగతంగా రూ. రెండు కోట్లు, తన కంపెనీ ఎంవీవీ బిల్డర్స్ తరపున రూ. తొమ్మిది కోట్లు ఇచ్చారు. నిజానికి ఆయన ఎన్నికలకు ముందే వైసీపీలో చేరారు. జగన్ పాదయాత్ర విశాఖలో అడుగు పెడుతున్న సమయంలో పార్టీలో చేరారు. అప్పుడే ఆయనకు టిక్కెట్ ఖరాయిందని చెప్పుకున్నారు. ఆయన పెద్ద ఎత్తున ధన సాయం చేశారని.. పాదయాత్ర ఖర్చు పెట్టుకున్నారని కూడా ప్రచారం జరిగింది. వాటి సంగతేమో కానీ.. వైసీపీకి అధికారికంగా రూ. 11 కోట్లు అయితే ఇచ్చినట్లు స్పష్టమయింది.
ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిన విరాళాల వివరాలను విజయసాయిరెడ్డి సమర్పించడంతో.. ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. అమరావతి పరిధిలోని అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటైన పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఎన్. శంకర్ రావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని చివరి క్షణంలో జగన్ రంగంలోకి దింపారు. ఆయన కూడా.. రూ. కోటి 30 లక్షలు వైసీపీకి ఇచ్చారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వెంచర్లు వేసిన శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీకి రూ. 30 లక్షలు విరాళం ఇచ్చారు. ఇక అభ్యర్థుల దగ్గర బంధువులకు చెందిన కొన్ని కంపెనీలు కూడా… విరాళాలిచ్చినట్లు తెలుస్తోంది.
వైసీపీకి విరాళాలిచ్చిన వారిలో.. అత్యధికంగా ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు రూ.27 కోట్లు ఇచ్చింది. ఆండ్రూ మినరల్స్ సంస్థ రూ.9.5 కోట్లు ఇచ్చింది. ఈ సంస్థకు చెందిన వారు వ్యక్తిగతంగా ఐదుగురు వ్యక్తులు కలిసి మరో కోటిన్న ఇచ్చారు. అంటే రూ. పదొండు కోట్లు ఆండ్రూ మినరల్స్ సంస్థ నుంచి వైసీపీకి వచ్చాయి. వీరు కాక.. వైసీపీకి విరాళాలిచ్చినట్లుగా చూపించిన పలువురుపై వ్యాపార పరమైన అవకతవకల ఫిర్యాదులు ఉన్నాయి. మొత్తానికి వైసీపీకి బల్క్ విరాళదాతలు ఉన్నారని.. విజయసాయిరెడ్డి అధికారికంగా వెల్లడించినట్లయింది.