హైదరాబాద్: మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి మెగాహీరోలు నలుగురివి ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. నిన్న వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న ‘కంచె’ చిత్రం ట్రైలర్ విడుదలై అద్భుతమైన విజువల్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. అర్థరాత్రి పవన్ తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ టీజర్‌ను, పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. దీనిపై రాంచరణ్ స్పందిస్తూ ఇంతవరకూ బాబాయ్ పోస్టర్లలో ఇదే బెస్ట్ అని ట్వీట్ చేశారు. మరోవైపు రాంచరణ్ తాజా చిత్రం ‘బ్రూస్లీ’ టీజర్ ఇవాళ ఉదయం విడుదలయింది. దీనిలో ఫ్యామిలీ సీన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలోలాగా కనిపిస్తున్నాడు. ఇటు సాయి ధరమ్‌తేజ్ చిత్రం ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రం ట్రైలర్ కూడా ఇవాళ విడుదలయింది.
ఇక పవన్‌కు సన్నిహితుడైన రచయిత కోన వెంకట్ పవనిజంపై ఓ పాట రాసి తను రచన చేస్తూ నిర్మిస్తున్న ‘శంకరాభరణం’ టీమ్ తరపున విడుదల చేశారు. శంకరాభరణం పోస్టర్ సైతం విడుదలయింది. దీనిలో నిఖిల్, నందిత హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొన్న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అక్కినేని ఫ్యామిలీలోని ముగ్గురు హీరోల చిత్రాల ప్రోమోలు విడుదలై రికార్డ్ సృష్టించగా, ఇవాళ నలుగురు మెగా హీరోల చిత్రాల ప్రోమోలు విడుదలవటం విశేషం.