`వకీల్‌సాబ్` ఆడియో నుంచి ఇప్పటి వరకూ 3 పాటలు విన్నారు. మగువా, జనగణమనతో పాటుగా ఓ డ్యూయెట్ బయటకు వచ్చింది. అయితే ఇప్పటి వరకూ విడుదల చేయని పాటలు ఇంకా ఓ రెండు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో ఓ ప్రమోషన్ గీతం కూడా ఉంటుంది. ఈ సినిమా పబ్లిసిటీలో భాగంగా ఆ పాటని వాడుకోవాలని చిత్రబృందం భావించింది. అయితే ఇప్పటి వరకూ ఆ పాటని విడుదల చేయలేదు. ఏప్రిల్ 4న హైదరాబాద్ లో `వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ సందర్భంగా ఈ పాటని విడుదల చేసే అవకాశం ఉంది. తమన్ ఈ పాటపై చాలా ఫోకస్ పెట్టాడని టాక్. ఈ పాట కోసం ఓ మంచి ట్యూన్ సమకూర్చాడని, ఆ పాట ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. అయితే ఈ పాట సినిమాలో ఉండదు. కేవలం ప్రమోషన్ కోసమే వాడారు. ఎండ్ టైటిల్స్ లో కనిపించే అవకాశం ఉంది.
ఈ సినిమా నిడివి 3 గంటలని సోషల్ మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు వేణు శ్రీరామ్ క్లారిటీ ఇచ్చేశాడు. సినిమా నిడివి రెండున్నర గంటలే అని స్పష్టం చేశాడు. ఈ సినిమా కోసం `లాయర్ సాబ్`, `మగువా.. ఓ మగువా` అనే టైటిల్స్ పరిశీలించార్ట. అయితే.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌నీ, వాళ్ల అంచనాల్నీ దృష్టిలో ఉంచుకుని `వకీల్ సాబ్` అనే టైటిల్ ఫిక్స్ చేశామని వేణు చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.