జగన్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో నమ్మకం పూర్తిగా పడిపోయిందనడానికి అనేక ఉదాహరణలు వెలుగు చూస్తున్నాయి. కాంట్రాక్టర్లు టెండర్లు వేయకపోవడం.. వైసీపీ నేతలు కూడా చిన్న చిన్న పనులు నామినేషన్ కింద చేయడానికి కూడా రాకపోవడం వంటివి మాత్రమే కాదు ఇప్పుడు ప్రభుత్వం స్థలాలు అమ్ముతామన్నా కొనేందుకు ఎవరూ మందుకు రావడం లేదు. జగనన్న లే ఔట్ల పేరుతో అమ్ముతున్న స్థలాలకు అసలు డిమాండే కనిపించడం లేదు. మూడు రాజధానులు తెచ్చి తీరుతామని చెబుతున్న విశాఖలోనే పట్టుమని పది మంది కూడా ప్రభుత్వ ప్లాట్లను కొనుగోలు చేయలేదు.
విశాఖలో దాదాపుగా రెండు వేల ప్లాటను ప్రభుత్వం జగనన్న లే ఔట్లలో వేలానికి పెట్టింది. భారీగా ప్రచారం చేసి వేలం నిర్వహించారు. ఇంత హడావుడి చేస్తే… రెండు వేల ప్లాట్లకు కనీసం రెండు వందల మంది కూడా ఆన్లైన్లో అప్లయ్ చేయలేదు. చివరికి తొలి విడతగా కట్టాల్సిన సొమ్మును కట్టిన వారు కేవలం 70 మంది మాత్రమే. వీరు కూడా మిగతా సొమ్ము కడతారా… పోయింది చాల్లే అనుకుంటారా అన్నది తర్వాత తేలుతుంది. కానీ ప్రభుత్వం ఆర్భాటం చేస్తున్న స్థలాల విషయాన్ని అసలు ప్రజలు పట్టించుకకోపవడమే ఇక్కడ ఆశ్చర్యం.
నిజానికి ప్రభుత్వం నేరుగా అమ్ముతోందంటే దానికో క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్లో ఎలాంటి సమస్యలు రావు. క్లియర్ టైటిల్ ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తారని అనుకుంటారు. గత ప్రభుత్వం అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే గంటల్లో బిజినెస్ క్లోజ్ అయింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏం చేసినా కనీస స్పందన రావడం లేదు . దీంతో అధికారవర్గాలు ఏం చేయాలా అని తర్జన భర్జన పడుతున్నాయి. ప్రజల్లో జగన్ సర్కార్ పలుకుబడి పూర్తిగా పడిపోయిందనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.