సింహాచలం అప్పన్న ఆస్తులు లీజుకు వెళ్తున్నాయి. ఈ మేరకు ఆలయ పాలక మండలి భేటీలో నిర్ణయం తీసుకోవడానికి రంగం సిద్ధమయింది. సింహాచలం అప్పన్న స్వామి ఆలయానికి అత్యంత ఖరీదైన భూములు..వాటిలో కళ్యాణ మండపాలు, భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కీలక ప్రాంతాల్లో ఉన్నాయి. మొత్తం పదహారు ఎకరాల్లో ఉన్న వాటిని 11 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇవన్నీ వాణిజ్య పరంగా ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉన్న స్థలాలు. గురువాం దేవస్థానం పాలకవర్గ సమావేశ అజెండాలో ఈ అంశాన్ని చేర్చి.. అనుమతి తీసుకోనున్నారు. భూములను లీజుకు ఇచ్చేందుకు కారణంగా.. ఆదాయం గురించి ప్రస్తావించబోతున్నట్లుగా చెబుతున్నారు. కరోనా కారణంగా ఆదాయం పడిపోయిందని… ఆలయ నిర్వహణ ఇబ్బందికరంగా మారిందన్న కారణంగా భూములు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు.
సింహాచలం అప్పన్నకు విజయనగరం పూసపాటి వంశీకులు రాసి ఇచ్చిన వేల ఎకరాల భూములు ఉన్నాయి. వాటి విలువ ఇప్పుడు వేల కోట్లలోనే ఉంటుంది. ఆలయానికి ట్రస్టీలుగా పూసపాటి వంశీయులే ఉండేవారు. అందుకే… స్థలాలు ఎక్కడా అన్యాక్రాంతం కాలేదు. ఆక్రమణలకు గురైనా… వాటిని పాడేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం.. పూసపాటి వంశీకుల చేతుల నుంచి మాన్సాస్ ట్రస్ట్‌ను లాగేసుకుని..ఆనందగజపతిరాజు మాజీ భార్య కుమార్తెకు పీఠం కట్టబెట్టడంతో పరిస్థితి మారిపోయింది. అమెను ఆ పీఠంపై కూర్చోబెట్టిందే భూముల కోసం అన్న విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ దిశగా నిజంగానే అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇప్పటికే.. కీలక ప్రాంతాల్లో.. వ్యాపార అవసరాలకు తగ్గట్లుగా ఉపయోగపడే భూములపై కొంత మంది పెద్దల కన్ను పడిందన్న ప్రచారం జరుగుతోంది. వారి నుంచి పెద్ద ఎత్తున లాబీయింగ్ కూడా జరుగుతోంది. దానికి తగ్గట్లుగా ఇప్పుడు సింహాచల ఆలయ భూములను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు సిద్ధమవడం.. రాజకీయ విమర్శలకు కారణం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని ముందు నుంచి పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి… అప్పన్న భూములు, ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు లీజులకు వెళ్లిపోవడం ఖాయమనే భావన ఏర్పడుతోంది.