ఏపీ ప్రభుత్వం సమగ్ర భూసర్వేను ఈ రోజు నుంచి ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఈ సర్వేను ప్రారంభిస్తారు. దశలవారీగా రాష్ట్రం మొత్తం పూర్తి చేస్తారు. ఈ సర్వే వల్ల రూ. లక్షలన్నర కోట్ల విలువైన సంపద ప్రజలకు చేరుతుందని ప్రభుత్వం చెబుతోంది. సర్వే ద్వారా.. సంపద ఎలా వస్తుందన్న అనుమానం రావొచ్చు కానీ.. దానికి ప్రభుత్వం.. సరైన సమాదానం ఇస్తోంది. గ్రామాల్లో ఉండే ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర ఖాళీ స్థలాలకు ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్ ఉండదు. వాటన్నింటికీ సర్వే ద్వారా హక్కు పట్టాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకూ ఆయా ఆస్తుల్ని వాడుకుంటున్నప్పటికీ.. బ్యాంకుల్లో తనఖా పెట్టుకోవడానికి కుదరడంలేదని ఇప్పుడు సర్వే చేయడం ద్వారా వాటిని తనఖా పెట్టుకునే చాన్స్ వస్తుందని తద్వారా రూ.లక్షన్నర కోట్ల సంపద వారికి చేరుతుందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని గ్రామ కంఠాల్లో కోటిన్నరకి పైగానే ఇళ్లు, ఇతర ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటి విలువ లక్షన్నర కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ భూములకు రెవెన్యూ సర్వే రికార్డులు లేవు. అవసరమైనప్పుడు ఏదైనా ధ్రువీకరణ పత్రం ఇచ్చే విధానమూ ఇంతవరకు లేదు. దీనివల్ల యజమానులు బ్యాంకు రుణాలు కూడా తీసుకునే పరిస్థితి లేదు. వివరాలు కూడా పంచాయతీల వద్ద లేవని ప్రభుత్వం చెబుతోంది. ఇంతకాలం కొనుగోళ్లు, అమ్మకాలు పెద్ద మనుషుల మధ్య కాగితాల ద్వారా జరిగిపోతున్నాయి. దీని వల్ల వివాదాలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఆస్తి సర్టిఫికెట్ జారీతో యజమానికి తనకు సంబంధించిన ప్రతి ఆస్తికీ ధ్రువీకరణ లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
సమగ్ర సర్వే పథకం ద్వారా ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల పరిధిలో అన్ని రకాల భూముల రీ సర్వే చేస్తుంది. డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే చేస్తారు. దాని ద్వారా ఆ విధంగా గ్రామ పరిధిలో ప్రతి ఇంటినీ, స్థలాన్ని హద్దులతో సహా గుర్తిస్తారు. అభ్యంతరాలను అక్కడిక్కడే పరిష్కరిస్తారు. ఒక్కొక్క ఆస్తికి వేర్వేరుగా ఆస్తి సర్టిఫికెట్లను గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా పంపిణీ చేస్తారు. ఎలాంటి సమస్యలు రాకపోతే.. ప్రజలకు మేలు జరుగుతుందన్న అంచనా ఉంది.