ఆంధ్రప్రదేశ్లో ఆస్తి పన్ను పెంపు ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రభుత్వ వర్గాలు… మంత్రి బొత్స సత్యనారాయణ లాంటివాళ్లు ఆస్తి పన్నును 0.15 శాతం మాత్రమే పెంచుతున్నామని దీనికి ఇంత రగడ ఎందుకని ప్రశ్నిస్తున్నాయి. కానీ ఇక్కడ విషయం 0.15 శాతం పెంపు కాదు. మొత్తం ఆస్తి విలువలో ఆస్తి పన్నును ఏటా 0.15 శాతం వసూలు చేస్తారు. ప్రతీ ఏటా ఆస్తి విలువ పెంచుతుంటాంటారు. అంటే.. ఈ 0.15 అలాగే ఉంటుంది. కానీ పన్ను మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడీ పన్నులు.. ప్రజల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.
కేంద్రం ఇచ్చేరుణాల కోసం సంస్కరణలు అమలు చేస్తున్నఏపీ… పట్టణ ప్రజలపై పన్నులు పెంచేందుకు కూడా అంగీకరించింది. అందులో భాగంగా ఆస్తి విలువలో 0.15 శాత పన్నును విధించాలని నిర్ణయించింది. ఎన్నికల సమయంలో నిర్ణయాన్ని వాయిదా వేసిన ప్రభుత్వం.. ఇప్పుడు.. అన్ని చోట్లా అమలు ప్రారంభించింది. ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. నోటిఫికేషన్ లో నివాస గృహాలపై ఆస్తి విలువపై 0.15 శాతం, వాణిజ్య, నివాసేతర భవనాలపై 0.3 శాతం, ఖాళీ స్థలాలపై 0.5 శాతం పన్ను వేస్తారు. ఆస్తి మూలధన విలువలో 0.15 శాతం పన్ను విధిస్తారు అంటే … ఆ ఆస్తి ముఫ్పై ఏళ్ల క్రితం కొనుగోలు చేసినప్పటికీ.. ఇప్పుడు ఉన్న విలువ ఆధారంగా పన్ను నిర్ణయిస్తారన్నమాట.
ఉదాహరణకు… విశాఖలో ఓ వ్యక్తి 30 ఏళ్ల కిందట..ఓ వ్యక్తి 30వేలు పెట్టి ఇల్లు స్థలం కొనుక్కున్నారనుకుంది. ఇప్పుడు ఆ స్థలం విలువ మూడు కోట్లు అయి ఉంటుంది. అందులో ఇల్లు ఉంటే 0.15 శాతం.. ఖాళీ స్థలమే అయితే 0.5 శాతం పన్ను కట్టాలి. మూడు కోట్ల స్థలానికి పన్ను యాభై వేలు అన్నమాట. ఇంటికి వచ్చేసరికి వేరే లెక్క ఉంటుంది. అందులో కట్టిన చదరపు అడుగుల వారీగా లెక్క వేసి.. ఇప్పటి విలువను లెక్కించి మరీ.. పన్నువసూలుచేస్తారు. అంటే ప్రస్తుతం ఉన్న పన్ను.. దాదాపుగా పది రెట్లు పెరుగుతుంది. రూ. వెయ్యి కట్టే వారు.. పదివేలు కట్టాల్సి ఉంటుంది.
ఈ విధానంలో ప్రభుత్వం డబ్బులు కావాల్సినప్పుడల్లా భూములు, కట్టడాల విలువను పెంచుకుంటూపోతే చాలు ప్రజల నుంచి కావాల్సినంత ఇంటి పన్ను పిండుకోవచ్చు. ఇప్పటికే ప్రతి ఏటా భూముల రేట్లు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీలో ఆస్తి ఉన్న ప్రజలు.. అది గ్రామమైనా… పట్టణమైనా.. నగరమైనా.. పన్నులు పది రెట్లు ఎక్కువగా కట్టడానికి సిద్ధపడాల్సిందే.