వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోడ్ లో వస్తారని ఎవరికీ తెలియదు. హెలికాఫ్టర్ మొరాయించిందని ఆయన రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నారని చివరి .. ఆయన బయలుదేరిన తర్వాతనే మీడియాకు తెలిసింది. అంతే.. పొలాల్లో పని చేసుకుంటున్న రైతులు రోడ్ల మీదకు వచ్చేశారు.ఆయన కాన్వాయ్‌కు అడ్డం పడ్డారు. ఇళ్ల స్థలాల కోసం పొలాలకు పరిహరం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారందర్నీ పోలీసులు ఈడ్చి పడేశారు. ఆయన వెళ్లిపోయారు. కానీ సమస్యకు పరిష్కారం ఈడ్చి పడేయమేనా ?
వాళ్లంతా వైసీపీ సానుభూతిపరులు
ధర్మవరం నియోజకవర్గంలో జగన్ కాన్వాయ్ కు అడ్డం పడిన వారంతా వైసీపీ సానుభూతిపరులు. వారిని నమ్మి నట్టేట మునిగిన వారు. పేదల ఇళ్ల కు టిడ్కో ఇళ్లు నిర్మించడానికి గత ప్రభుత్వం భూములు సేకరించింది. అప్పుడు ఎకరానికి ఐదు లక్షల పరిహరం ఇచ్చింది. అయితే వైసీపీ నేతలు .. తమ పార్టీ సానుభూతిపరుల్ని రెచ్చగొట్టారు. పరిహారం చాలదని కోర్టుకెళ్లేలా చేసుకున్నారు. సగం మంది భూములు ఇచ్చిన వారు పరిహారం తీసుకున్నారు. కోర్టుకెళ్లిన వారు వైసీపీ సానుభూతిపరులు. వారికి పరిహారాన్ని ప్రభుత్వం కోర్టులో జమ చేసింది. తాము వచ్చాక పరిహారం పెంచి ఇస్తామని ఆశ పెట్టారు.
వైసీపీ మాటలు విని పొలం..పరిహారం పోగొట్టుకున్న రైతులు
అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక పైసా పరిహారం పెంచకపోగా… అసలు పట్టించుకోవడం మానేశారు . టిడ్ ఇళ్లను కట్టలేదు కానీ సెంటు స్థలాలుగా మార్చేసి పంచేశారు. ఇక్కడ పునాదులు వేసుకున్నారు. కానీ పరిహారం రాక రైతులు మాత్రం నలిగిపోతున్నారు. వైసీపీ నేతల మాటలు నమ్మి.. తాము నిండా మునిగిపోయామని పరిహారం ఇవ్వాలని వారంటున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రభుత్వం నుచి పైసా కూడా మంజూరు చేయించక వారికి మొహం చాటేస్తున్నాడు. దీంతో రైతులు ముఖ్యమంత్రి కాన్వాయ్ కు అడ్డం పడ్డారు.
ఏ గ్రామంలో చూసినా ప్రభుత్వ బాధితలే !
ధర్మవరం నియోజకవర్గంలో రెండు గ్రామాలు మాత్రమే కాదు… రాష్ట్రం మొత్తం ఏ గ్రామంలో చూసినా ప్రభుత్వ బాధితులు ఉన్నారు. వారి జీవితల్ని పణంగా పెట్టి చేసిన పాలనా ఫలితాలు కనిపిస్తున్నాయి. అత్యంత దుర్భరమైన పరిస్థితులు రైతులకు కనిపిస్తున్నాయి. జగన్ పల్లె నిద్ర అంటూ చేస్తే సమస్యలు తెలుస్తాయని.. కానీ ఆయన ప్రజల్లోకి రావడంలేదని అంటున్నారు. భద్రత ఏర్పాటు చేసుకుని వచ్చి ప్రజల సమస్యలను వినాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.