కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ “ప్రజలలో ఆదరణ కోల్పోయిన ఆ పార్టీ కొత్తగా నాయకులను తయారుచేస్తోందని” ఆరోపించారు. కాంగ్రెస్ సంగతి ఎలాగున్నా జె.ఎన్.యు విద్యార్ధి కన్నయ్య కుమార్ ని అరెస్ట్ చేసి, హైదరాబాద్, విజయవాడలో అతనికి నిరసనలు తెలియజేస్తూ భాజపా అనుబంధ సంస్థ ఏ.బి.వి.పి. విద్యార్ధి సంఘాలే అతనిని మరింత పాపులర్ అయ్యేలా చేస్తున్నాయి.
అతను ఈరోజు హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకొన్నాడు. అక్కడ ఐవి ప్యాలెస్ లో సిపిఐ నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు కూడా భాజపా కార్యకర్తలు అతనిని అడ్డుకొనే ప్రయత్నం చేసారు. అప్పుడు భాజపా, సిపిఐ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. సహజంగానే అది అందరి దృష్టిని ఆకర్షించింది. అతని రాకను, సభను నిరసిస్తూ భాజపా అనుబంధ సంస్థలు చేస్తున్న హడావుడి వలన అతని గురించి ఇంతవరకు తెలియని వాళ్ళు కూడా అతను ఎవరు? అతను వస్తే ఎందుకు నిరసనలు తెలియజేస్తున్నారు? అని కుతూహలంతో అతని గురించి తెలుసుకొంటున్నారు.
నిజానికి అతనిని పట్టించుకోకుండా ఊరుకొని ఉంటే అతని హైదరాబాద్, గన్నవరం పర్యటనలకు అంత ప్రాధాన్యత ఏర్పడి ఉండేది కాదేమో. కానీ కానీ అతనిని ఎక్కడికి అక్కడ అడ్డుకోగలిగితే అతనిపై పైచెయ్యి సాధించినట్లు భాజపా భావిస్తున్నట్లుంది. కానీ దాని వలన భాజపా ప్రతిష్టే ఇంకా మసక బారుతోంది. పైగా కేంద్రప్రభుత్వం కూడా విద్యార్ధుల పట్ల అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందనే భావన విద్యార్ధులకు కలిగేలా చేస్తోంది. కనుక ఇప్పటికయినా భాజపా కన్నయ్య కుమార్ ని వదిలిపెట్టేస్తే అందరికీ మంచిది.