తెలంగాణా ప్రభుత్వం ఒకేసారి విద్యుత్ మరియు ఆర్టీసి చార్జీలు పెంచేయడంతో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ రోడ్లెక్కి ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నాయి. అవి ప్రతిపక్షంలో ఉన్నాయి గాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం సహజమే. వాటిలో తెదేపా, వైకాపాలు కూడా ఉన్నాయి. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసి డిపోలు, ఆర్డివో కార్యాలయాలు, కలెక్టర్ల కార్యాలయాలు, విద్యుత్ డిఈ, ఏఈ కార్యాలయాల ముందు ధర్నాలు చేసి నిరసనలు తెలియజేయాలని తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ నిన్న తన పార్టీ నేతలు, కార్యకర్తలకి పిలుపునిచ్చారు. ప్రభుత్వ దిష్టి బొమ్మలు (?) దగ్ధం చేసి నిరసనలు తెలియజేయాలని కోరారు. ప్రభుత్వం దిగివచ్చి పెంచిన చార్జీలు ఉపసంహరించుకొనే వరకు పోరాడుదామని పిలుపునిచ్చారు.
ప్రజలకి కష్టం, నష్టం కలిగించే అటువంటి సమస్యలపై ప్రతిపక్షాలు పోరాడటం సహజమే కనుక ఆయనని తప్పు పట్టలేము. తెలంగాణాలో చార్జీలు పెంచడం తప్పని తెదేపా భావిస్తోంది..వాదిస్తోంది కనుక ఆంధ్రాలో ఎప్పటికీ విద్యుత్, ఆర్టీసి బస్సు చార్జీలు పెంచకుండా ఊరుకొంటుందా? ఒకవేళ రేపు ఏదో ఒకరోజు ఆంధ్రాలో కూడా పెంచవలసి వస్తే, అప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ఇదే విధంగా ధర్నాలు, ర్యాలీలు చేయకుండా ఊరుకొంటాయా? అప్పుడు వాటికి తమ పార్టీ ఏమని జవాబు చెపుతుంది? అని తెలంగాణా తెదేపా నేతలు ఒకసారి ఆలోచిస్తే బాగుండేది.
రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఇటువంటి అంశాలు నేటికీ ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతూనే ఉన్నాయి. ధనిక రాష్ట్రమైన తెలంగాణాలోనే చార్జీలు పెంచేశారు కనుక ఆర్ధిక సమస్యలతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ లో చార్జీలు పెంచడం సమంజసమేనని సమర్ధించుకొంటారేమో?
ఇక విశేషం ఏమిటంటే, ఈసారి తెలంగాణా వైకాపా కూడా దీనిపై నోరు విప్పి మాట్లాడుతోంది. ధర్నాలు, ర్యాలీలు చేయడానికి సిద్దపడుతోంది. బహుశః నలుగురితో నారాయణ అన్నట్లుగా చేస్తున్నందున తమ నిరసనలని ముఖ్యమంత్రి కెసిఆర్ కి పెద్దగా ఆగ్రహం కలిగించదనే ధైర్యంతోనే ఈవిధంగా తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారేమో?
కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలోను ప్రతిపక్షంలోనే ఉంది. అధికార పార్టీలతో ఎటువంటి మిత్రత్వం లేదు కనుక దానికి రెండు రాష్ట్రాలలో నిరసనలు, ధర్నాలు చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు.