ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జనం దైర్యం తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభిస్తున్నారు. అప్పటికే అంగన్ వాడి వర్కర్లు రాష్ట్రం మొత్తం విస్తృతంగా ధర్నాలు చేస్తున్నారు. వారు ఇప్పటికే సమ్మెలో ఉన్నారు. ప్రభుత్వంపై.. హామీలు ఇచ్చి మోసం చేసిన సీఎం జగన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ఇక ఒక్కో వర్గం.. మెల్లగా పోరుబాట పడుతోంది. ఆశా వర్కర్లు కూడా రోడ్డెక్కుతున్నారు. వారు రోడ్డెక్కితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఇంకా విచిత్రంగా.. వాలంటీర్లుకూడా అదే బాటలో ఉండటం వైసీపీ వర్గాలను సైతం షాక్ కు గురి చేస్తోంది.
వాలంటీర్లు అంటే ఎవరు.. మా పార్టీ వాళ్లే.. అని వైసీపీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ల పార్టీ వాళ్లే అడ్డం తిరుగుతున్నారు. తమకు జీతాలు పెంచాలని.. పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ సమ్మెకు వెళ్లబోతున్నారు. వారికి ఇటీవలే 750 రూపాయలు పెంచారు. ఈ పెంపుదల వారిలో మరింత ఆగ్రహానికి గురైంది. ప్రభుత్వ పనులే కాకుండా.. వైసీపీ సొంత పనులకు కూడా వాడుకుంటూ.. తమది సేవ అని చెప్పడం ఏమిటని వారు రగిలిపోతున్నారు. వాలంటీర్లు కూడా సమ్మెలోకి వెళ్తే.. ఇతర వర్గాలకు అంత కంటే ప్రోత్సాహం ఇక ఉండదు.
గతంలో వాలంటీర్లు సమ్మె చేశారు. అప్పట్లో జీతాలు పెంచలేము కానీ అవార్డులు ఇస్తామని చెప్పి బుజ్జగించారు. కానీ ఎన్నికలకు ముందు వాలంటీర్లు తగ్గాలనుకోవడం లేదు. వాలంటీర్లే జగన్ రెడ్డిపై తిరుగుబాటు చేస్తే ఇక తాము ఎందుకు సైలెంట్ గా ఉండాలన్న భావనతో.. ప్రభుత్వ అన్యాయానికి గురైన ఇతర వర్గాలు పోరాట మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. చివరికి పీఆర్సీ .. ఇతర ప్రయోజనాల కోసం ఉద్యోగులు కూడా సమ్మె బాట పట్టే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఉద్యోగ సంఘాల నేతలుకూడా ఆలోచిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో తాము చేసిన నిర్వాకాలకు వచ్చే ప్రభుత్వంపై తమపై వేధింపులకు పాల్పడకుండా ఉండాలంటే.. ఇప్పుడు ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సి ఉంటుందని భావిస్తున్నారు. వారు కూడా రోడ్డెక్కితే… ఇక సామాన్య ప్రజలు కూడా రోడ్లపైకి రావడం ఖాయమవుతుంది. అంటే అన్ని వర్గాలూ.. జగన్ రెడ్డిపై యుద్ధం ప్రారంభించినట్లు అవుతుంది.