అమెరికా రగిలిపోతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ తోలు వలిచి చెప్పులు కుట్టించుకునేందుకు రెడీ అయ్యారని క్లారిటీ రావడంతో అందరూ తమను తాము రక్షించుకునేందుకు రోడ్డెక్కుతున్నారు. తమ ఉద్యమానికి హ్యాండ్సాఫ్ అని పేరు పెట్టుకున్నారు. తమ జీవితాలను తలకిందులు చేసి.. పన్నుల భారం మోపి.. అమెరికాను ఓ దుర్భర దేశంగా చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పటికిప్పుడు తిరుగుబాటు చేయకపోతే తర్వాత చేసినా ప్రయోజనం ఉండదని రోడ్లపైకి వస్తున్నారు.
అధ్యక్షుడి నిర్ణయాలపై అప్పుడే వ్యతిరేకత
అమెరికాలో ప్రజా ఉద్యమాలు అనేవి నల్లజాతీయులకు అన్యాయం జరిగినప్పుడో.. మరో కారణతోనే జరుగుతూంటాయి కానీ.. అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలు ఇటీవలి కాలంలో లేవు. ఎందుకంటే తాము ఎన్నుకున్న అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలను వారు గౌరవిస్తూ ఉంటారు. కానీ ట్రంప్ నిర్ణయాలను మాత్రం వారు అంగీకరించలేకపోతున్నారు. ప్రపంచం ముందు అమెరికాకు తలవంపులు తేవడమే కాకుండా.. తమ జీవన ప్రమాణాలకు పాతరేస్తున్నారని అమెరికా ప్రజలకు అర్థమైంది.
మరింత పెరగనున్న హ్యాండ్సాఫ్ ఉద్యమం !
హ్యండ్సాఫ్ ఉద్యమం మరింతగా పెరగనుంది. సాధారణంగా పార్టీలు, గ్రూపులు ఇచ్చే పిలుపులు మేరకు జరిగే ప్రదర్శనలు ఆ రోజు వరకే ఉంటాయి కానీ ట్రంప్ బాధితులైన ప్రజలు చేస్తున్న ఉద్యమం కావడంతో రోజు రోజుకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది విప్లవం మాదిరిగా మారినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. అమెరికా ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంటి. ఓ వైపు ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు..మరో వైపు ప్రజా ఉద్యమాలు కలగలిపి.. అమెరికాను కల్లోల దేశంగా మారుస్తున్నారు.
ట్రంప్ తగ్గే చాన్స్ లేదు.. అందుకే అమెరికా భవిష్యత్ గందరగోళం !
ప్రజా ఉద్యమాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలొగ్గే అవకాశాలు లేవు. తనకు ఓట్లు వేసిన ఎవరూ రోడ్లు ఎక్కి ఉద్యమాలు చేయరని.. తను పెడుతున్న వాతల్ని భరిస్తారని ఆయన అంచనా. అందుకే ప్రజా ఉద్యమాలకు తగ్గే ప్రశ్నే లేదని.. తన బలం ఏ మాత్రం తగ్గదని ప్రకటన చేశారు. ఇప్పుడు అమెరికా ప్రజలంతా ఏకమై ట్రంప్ నిర్ణయాల్లో తగ్గేలా చేస్తారో లేకపోతే ఆయన పదవికే ఎసరు తెచ్చేలా పోరాడుతారో చూడాల్సి ఉంది. అనేక దేశాల్లో సహనం నశించిన ప్రజలు పాలకుల్ని తరిమికొట్టిన ఘటనలు మన కళ్ల ముందే ఉన్నాయి.