ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు 90 శాతం ఓటు బ్యాంకు ను వృద్ది చేసుకోవడం కోసం ఉంటాయి. మిగిలిన 10 శాతం పెట్టుబడిదార్లను మచ్చిక చేసుకోవడానికి ఉంటాయి. నిజంగా దేశాన్ని, లేదా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేసే నిర్ణయాలు మహా అయితే ఇందులోనుంచి ఒకటిరెండు శాతం వేరుగా ఉండవచ్చు. అయితే ఒక నిర్ణయం ఓటు బ్యాంకును ఖచ్చితంగా దెబ్బతీస్తుందని అనుకున్నప్పుడు, దేశ ఆర్థిక ప్రయోజనాలకు దన్నుగా నిలిచేదే అయినా దాన్ని దిద్దుకోవడానికి, ఓటు బ్యాంకును మాత్రం పదిలంగా కాపాడుకోవడానికి ప్రభుత్వం వెనకాడదు.. అని ప్రస్తుత పరిణామాలు నిరూపిస్తున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పీఎఫ్ సొమ్మును ఉపసంహరించుకునే సమయంలో 60 శాతంపై పన్ను వేసే ప్రతిపాదనను పెట్టారు. అయితే దీనిని వెనక్కు తీసుకోవడానికి ఇప్పుడు నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది. పీఎఫ్నుంచి తీసుకునే మొత్తం 60 శాతంపై పన్ను వేయాలనే నిర్ణయంపై దేశవ్యాప్తంగా వేతనజీవులు అందరిలో భారీస్థాయిలో విమర్శలు ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో.. ఏకంగా ప్రధాని మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిర్ణయాన్ని మార్చవలసిందిగా అరుణ్‌జైట్లీని పురమాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ ఆయన పార్లమెంటులో ప్రకటన చేసే అవకాశం ఉంది.
వాస్తవానికి పీఎఫ్ సొమ్ము మీద మాత్రం వడ్డీ విధించే ఆలోచన ప్రెవేటు సంస్థలకు వేతన జీవుల సొమ్మును దోచి పెట్టేందుకు ఒక వక్రమార్గంగా కనిపిస్తోందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఉద్యోగులు డబ్బు పొదుపు చేసేందుకే ఎక్కువ పన్ను రాయితీ ఉండే పథకాలు ఉన్నాయి. పొదుపు వైపు ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుంది. అయితే ప్రెవేటు సంస్థలో చేసుకునే పొదుపు మొత్తాలు తిరిగి చేతికి అందేప్పుడు.. సదరు ఉద్యోగికి దానిపై పన్నేమీ ఉండదు. అయితే ప్రభుత్వాన్ని మాత్రమే నమ్మి, వారు తక్కువ వడ్డీ ఇచ్చినా పీఎఫ్ ఖాతాలో మాత్రమే పొదుపు చేసుకున్నందుకు ఉద్యోగులకు పన్ను విధించడం అంటే.. వారు పీఎఫ్ అదనపు పొదుపులను మానుకుని ప్రెవేటు సంస్థలను ఆశ్రయించేలా ప్రోత్సహించడమేననే విమర్శలు కూడా ఉన్నాయి.
ఏది ఏమైనప్పటికీ … ఉద్యోగులకు ఆగ్రహం తెప్పిస్తే మహమహా సామ్రాజ్యాలే కూలిపోయాయనే భయంతో మోడీ సర్కారు ఈ విషయంలో వెనుకడుగు వేసినట్లుగా కనిపిస్తోంది.