తిరుమల శ్రీనివాసుడి సేవ కోసం.. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ఎస్వీబీసీ చైర్మన్ పదవి… టాలీవుడ్‌ను దాటి పోవడం లేదు. ఏ పార్టీ వచ్చినా… ఆ పదవిని.. సినీ ప్రముఖులకే అప్పగిస్తున్నారు. గత ప్రభుత్వం… దర్శకేంద్రండు కే.రాఘవేంద్రరావుకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఆయనకే… ఈ బాధ్యతలు అప్పగించడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. గతంలో అన్నమయ్య అనే సినిమా తీశారు. ఆ తర్వతా భక్తి భావం ఉప్పొంగే సినిమాలు, సీరియల్స్ కంటిన్యూ చేశారు. స్వయంగా ఆయన శ్రీవారికి పరమ భక్తులు. ఇలాంటి క్వాలిఫికేషన్లు ఉండటంతో.. ఆయనకు ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు.. విమర్శలు రాలేదు. కానీ.. ఇప్పుడు… వైసీపీ తరపున… ఎస్వీబీసీ చైర్మన్ గా పదవి దక్కించుకున్నది.. హాస్య నటుడు ఫృధ్వీ. ఆయన ఆదివారం.. బాధ్యతలు చేపట్టగానే… ఎస్వీబీసీలో అక్రమాలు జరిగాయని.. వాటిని బయటకు తీస్తామని ప్రకటించేశారు.
ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్న రాఘవేంద్రరావు హయాంలో.. ఎన్నో అక్రమాలు జరిగాయని.. భక్తులు ఫిర్యాదు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తాము కక్ష పూరితంగా వ్యవహరించబోమని, అవినీతికి పాల్పడి ఉంటే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎస్వీబీసీలో అక్రమాలు జరిగాయని భక్తులు ఆరోపిస్తున్నారని, దేవుడికి సంబంధించింది దేవుడికే చెందాలన్నది తన సిద్ధాంతమని అన్నారు. దేవుని సొత్తు జేబులో వేసుకోవాలి అనుకొనే వారికి కనిపించని నాలుగో సింహంలా స్వామివారే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఫృధ్వీ వ్యాఖ్యలు టాలీవుడ్లో.. చర్చనీయాంశం అయ్యాయి. ఫృధ్వీ రాఘవేంద్రరావునే టార్గెట్ చేస్తున్నారన్న చర్చ ప్రారంభమయింది.
నిజానికి.. వైసీపీలో ఇప్పుడు ఏ పదవి పొందిన వారైనా… ముందుగా చేయాల్సింది.. తాము పదవి పొందిన శాఖలో.. లేదా సంస్థలో.. గత ఐదేళ్లలో.. తీవ్రమైన అవినీతి జరిగిందని.. దోషులను వదిలి పెట్టబోమని హెచ్చరించడమే. ఫృధ్వీ కూడా.. వైసీపీ పాలసీని ఫాలో అయ్యారు… అంతే తప్ప.. రాఘవేంద్రరావును టార్గెట్ చేయాలన్న కారణం కాదన్న వాదన వైసీపీ వర్గీయులు వినిపిస్తున్నారు. ఏదైనా… అవినీతిని వెలికి తీసి.. చూపిస్తే.. సన్మానం చేస్తానని జగన్మోహన్ రెడ్డి నేరుగానే చెబుతున్నారు. ఆ సన్మానం కోసమైనా ఫృధ్వీ… ప్రకటనలను నిజం చేస్తారేమో చూడాలి… !