ధర్టీ ఇయర్స్ ఫృధ్వీ ఇప్పుడు తనను జగన్ పట్టించుకోవడం లేదని.. ఇక పట్టించుకోరని అర్థం అయిపోయింది. పదవి ఇచ్చినట్లుగా ఇచ్చి ఫోన్లు ట్యాప్ చేసి.. కుట్ర చేశారని తెలుసుకున్నాక కానీ ఆయనకు రాజకీయం అర్థం కాలేదు. ఇప్పుడు వైసీపీ లో చోటు లేదు.. వైసీపీని చూసుకుని సినిమా ఇండస్ట్రీపై ఆయన చేసిన చిల్లర పనుల కారణంగా ఉపాధి కూడా కరవైంది. దీంతో ఇప్పుడు ఫృధ్వీ జగన్‌ను విమర్శించి పవన్‌ను కాకా పట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా యూ ట్యూబ్ చానళ్లను పిలిపించుకుని జగన్‌కు పవన్ కరెక్ట్ అని గట్టిగా చెబుతున్నారు.
ఇక జగన్ పిలిచినా వెళ్లబోనని.. పవన్‌తోనే ఉంటానని చెబుతున్నారు. అయితే ఫృధ్వీ తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటున్నారని ఆయనను జనసేనలోకి తీసుకోవడం అంటే.. లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం తప్పించి.. ఒక్క ఓటు ఉపయోగం ఉండదన్న అభిప్రాయం జనసేనలో వినిపిస్తోంది. ఆయన ఇది వరకే పవన్ ను కాకా పట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో యూ ట్యూబ్ చానళ్లకు ఇంటర్యూలు ఇస్తూ.. జగన్ తో ఇక సంబంధం లేదని.. ఆయన వాడుకుని వదిలేసే రకం అని విమర్శలు గుప్పిస్తున్నారు.
జగన్‌ను చూసుకుని చిన్నా పెద్దా తేడా లేకుండా ఫృధ్వీ గత ఎన్నికలకు ముంచు చెలరేగిపోయారు. ఆ మాటలన్నీ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఏం చూసుకుని అంత చెలరేగిపోయారో కానీ ఇప్పటికి అసలు విషయం బోధపడింది. కానీ జరగాల్సిన నష్టం ఫృధ్వీకే జరిగిందని.. ఆయనకు అటు సినిమా.. ఇటు రాజకీయ కెరీర్లు పూర్తిగా ముగిసిపోయాయన్న వాదన వినిపిస్తోంది. ఏం చేసినా జనసేనలోకి ఆయన ఎంట్రీ సాధ్యం కాదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.