ఎస్వీబీసీ చైర్మన్ పదవికి నటుడు బాలిరెడ్డి ఫృధ్వీరాజ్ రాజీనామా చేశారు. పదవి నుంచి వైదొలగాలని.. జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో తాను పదవి నుంచి వైదొలుగుతున్నానని ఫృధ్వీ ప్రకటించారు. అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ.. వ్యాఖ్యలు చేయడంతో పాటు.. ఎస్వీబీసీ ఉద్యోగుల్ని లైంగికంగా వేధిస్తున్నట్లుగా ఆరోపణలు రావడంతో..జగన్మోహన్ రెడ్డి ఆయనపై సీరియస్ అయ్యారు. పదవి నుంచి తీసేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయన నుంచి రాజీనామా పత్రాన్ని టీటీడీ వర్గాలు తీసుకున్నాయి. ఆ తర్వాత ఫృధ్వీ మీడియా సమావేశం పెట్టి ఈ విషయం వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.
ఏన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశానన్నారు. రైతులందరినీ పెయిడ్ ఆర్టిస్టులని తాను అనలేదని కవర్ చేసుకున్నాయి. ఫేక్ వాయిస్‌తో తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. దీనివల్ల తన కుటుంబం, స్నేహితులు ఎంతో బాధపడ్డారని … ఎస్వీబీసీ ఉద్యోగులతో స్నేహంగా ఉంటానని, పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మద్యం తాగానని అబద్దాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే.. ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి తాను తాత్కలికంగానే తప్పుకున్నానని.. విజిలెన్స్ విచారణ తర్వాత మళ్లీ ఎస్వీబీసీలోకి వస్తానని ఫృధ్వీ చెప్పుకొచ్చారు.
నిజానికి టీటీడీ చైర్మన్ పదవితో పాటు.. ఎస్వీబీసీ చైర్మన్ పదవిని కూడా..మొదట వైవీ సుబ్బారెడ్డికే జగన్ అప్పగించారు. అయితే.. వైసీపీకి పని చేసిన కారణంగా తనకు.. సినీ పరిశ్రమలో ఉపాధి అవకాశాలు రావడం లేదని.. ఆయన వైసీపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడంతో.. వైవీ సుబ్బారెడ్డి కి పదవి కోసి.. దాన్ని ఫృధ్వీకి అప్పగించారు. అప్పట్నుంచి ఫృధ్వీ చాలా హడావుడి చేశారు. చానల్‌కు సర్వశ్వం తానే అన్నట్లుగా వ్యవహరించడమే.. కాదు.. కొన్ని వేషాలు కూడావేశారు. ఆయన వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. చివరికి ఆయన పదవి పోగొట్టుకోవడానికి కూడా ఆ అత్యుత్సాహమే కారణం అయింది. ఎలా చూసినా ఫృధ్వీకి మరోసారి.. ఎస్వీబీసీలో ఎంటరయ్యే అవకాశం ఉండదని అంటున్నారు.