ప్రేమించానని వెంటబడటం… కుటుంబసభ్యుల్ని ఏదో చేస్తానని బెదిరించడం.. ఇంటికెళ్లి మారణాయుధాలతో దాడులు చేయడం.. ఇవన్నీ పాత ఫ్యాషన్. కాస్త డబ్బు.. పలుకుబడి ఉన్న వారయితే ఇంకా ఎక్కువ చేస్తారు. తాము వన్ సైడ్‌గా ప్రేమించి… తమను ప్రేమించాలని వెంటపడే అలాంటి వాళ్లు సైకోలుగా మారి… వేధిస్తూ ఉంటారు. అలాంటి ఓ డబ్బున్న సైకో లవర్ వ్యవహారం హైదరాబాద్‌లో వెలుగు చూసింది. బాధితులు డాక్టర్ కావడం… సమాజంలో కాస్త గౌరవం ఉండటంతో.. వీలైనంత వరకూ ఆ సైకోలవర్ బారిన పడకుండా ప్రయత్నించింది కానీ.. ప్రయోజనం లేక… చివరికి పోలీసుల్ని ఆశ్రయించింది.
హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో నివాసం ఉండే ఓ లేడీ డాక్టర్… ఓ ప్రముఖ క్లినిక్‌లో పని చేస్తూ ఉంటారు. ఆమెది హ్యాపీ లైఫ్. పెళ్లయింది.. ఓ బిడ్డ కూడా ఉన్నాడు. అయితే.. ఆమె వద్దకు జుట్టు రాలిపోతున్న రోగానికి ట్రీట్ మెంట్ కోసం అని విశ్వనాథ్ అనే వ్యక్తి వెళ్లాడు. ఆమె వృత్తిలో భాగంగా ట్రీట్ మెంట్ చేసి పంపింది. అయితే… ఆ విశ్వనాథ్ ఆమె దగ్గరే తన మనసు పడేసుకున్నాడు. వైద్యురాలిని మరో రకంగా చూశాడు. అప్పటి నుండి తనతో స్నేహం చేయమని వేధించడం ప్రారంభించాడు. ఆ వేధింపులు అలాంటి ఇలాంటివి కాదు. డబ్బున్న సైకో.. ఏం చేయగలడో అన్నీ చేశాడు.
మొదట డాక్టర్ కుటుంబం నివాసం ఉంటున్న అపార్టుమెంట్లోనే మారుపేరుతో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. పరిచయాలు పెంచుకునే ప్రయత్నం చేశాడు. డాక్టర్ బిడ్డకు బొమ్ములు కొనిపిస్తూ.. ఆ కుటుంబానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. ఆమెను నీడలా వెంటాడేందుకు ఆమె కారుకు జీపీఎస్ అమర్చాడు. ఆతని వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతూండటంతో చివరికి ఆ డాక్టర్ ఫ్యామిలీ ఫ్లాట్ ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లింది. అయినా జీపీఎస్ సాయంతో ఆమె ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టి వెళ్లి వేధించేవాడు. తాను ఎంత రహస్యంగా వెళ్తున్నా… ఆ సైకో కనిపెడుతూండటంతో… ఎలా తెలుస్తోందోనని పరిశీలన జరిపిన డాక్టర్‌కు తన కారుకు అమర్చిన జీపీఎస్ పరికరం చూసి.. షాక్ తగిలినట్లయింది.
మొదట విషయం భర్తకు.. కుటుంబసభ్యులకు చెప్పింది. దాంతో వారు కుటుంబ పరువు కోసం… అతనికి మంచి గా చెప్పి చూడాలని చూశారు. అయితే ఆ సైకోలవర్ విశ్వనాథ్… ఓ టీఆర్ఎస్ నేత సాయంతో రివర్స్ బెదిరింపులకు పాల్పడటమే కాదు… దాడికి కూడా ప్రయత్నించడంతో చివరికి వారు పోలీసుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రేమ వేధింపులు.. కాలేజీల్లోనే కాదు.., బయట కూడా ఉంటాయి. సాంకేతికతను ఉపయోగించుకుని మరింత ఎక్కువగా ఈసైకోలు రెచ్చిపోతున్నారని ఈ ఘటన నిరూపితమవుతుంది.