” మాకూ ..మాకూ మధ్యం లక్షా 90 ఉంటాయి మీకెందుకు ” అనేది తెలుగు రాష్ట్రాల్లో వాడే ఓ ఊతపదం. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అక్కడి ప్రభుత్వానికి కూడా అన్నే ఉన్నాయి. కానీ మీకెందుకు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రజలు – ప్రభుత్వం చూసుకోవడం లేదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మీరే చెప్పాలని వారంతా కోర్టుకు వస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంపై హైకోర్టులో ఉన్న పిటిషన్లు 1 లక్షా 94వేలు అని పీటీఐ వార్తా సంస్థ ప్రకటించింది. జిల్లా కేసుల్లో ఎన్ని ఉన్నాయో లెక్క తెలీదు కానీ హైకోర్టులో మాత్రం ప్రభుత్వంపై లక్షా 94వేలు కేసులు ఉన్నాయి. వీటితో ఆగడం లేదు. రోజుకు నాలుగు నుంచి ఐదు వందల పిటిషన్లు నమోదవుతున్నాయి.
చేసిన పనులకు చెల్లింపుల్లేవని కోర్టుల్లో పిటిషన్లు
ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన నిధులు రావడం లేదనే పిటిషన్లే ఎక్కువ ఉంటున్నాయి. చెల్లింపుల్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం.. పనులు చేసిన వారికి చెల్లింపులు చేయకుండా వేధిస్తూండటంతో వారంతా హైకోర్టును ఆశ్రయిస్తున్నాయి. ఉపాధి హామీ పనుల కాంట్రాక్టర్లకు చెల్లింపులపై ఏడాది నుంచి ప్రభుత్వం రకరకాల కారణాలు చెప్పి కోర్టు చేత చీవాట్లు తింటోంది. ఒక్క ఉపాధి హామీ పనుల కాంట్రాక్టర్లు మాత్రమే కాదు.. ఇతర సివిల్ పనులు చేసిన వాళ్లు..వివిధ వస్తువులు సరఫరా చేసిన వాళ్లు అనేక మంది తమ బిల్లుల చెల్లింపులు కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.
కౌంటర్లు వేయకుండా ధిక్కరణకు పాల్పడుతున్న అధికారులు
కోర్టు ఆదేశాలిచ్చినా అధికారులు పాటించడం లేదు. కనీసం కౌంటర్లు కూడా దాఖలు చేయడం లేదు. దీంతో కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ కోర్టు ధిక్కరణ కేసులు ఎనిమిది వేలు ఉన్నాయి. ఇవన్నీ కేసుల భారంతో కౌంటర్లు వేయకపోడం వల్ల వచ్చి పడిన కేసులే. ఓ సందర్భంగా ప్రత్యేకంగా చీఫ్ సెక్రటరీనే అన్ని శాఖలతో సమావేశం పెట్టి ఖచ్చితంగా కౌంటర్లు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ రోజుకు నాలుగు, ఐదు వందల పిటిషన్లు ప్రభుత్వంపై పడుతూంటే ఎన్నింటికనికౌంటర్లు వేస్తారు.
కోర్టుల చుట్టూ ఉన్నతాధికారుల ప్రదక్షిణలు
చీఫ్ సెక్రటరీ నుంచి అనేక మంది ఉన్నతాధికారులు హైకోర్టు చుట్టూతిరుగుతున్నారు. ప్రతీ రోజూ డ్యూటీకి వచ్చినట్లుగా కొన్ని కేసుల్లో వాయిదాలకు ఉన్నతాధికారులు హాజరవుతున్నాయి. చాలా కేసుల్లో చీవాట్లు తింటున్నారు. వారు కోర్టు ధిక్కరణకు పాల్పడుతూండటం… వారి ఆదేశాలను అమలు చేయకపోతూండటంతో కోర్టులు కూడా వారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. దీంతో వారి పరువూ పోతోంది. మీడియాలో కోర్టు చీవాట్లు విషయాలు ప్రముఖంగా వస్తూండటంతో ఏం తలదించుకోక తప్పనిపరిస్థితి వారికి ఏర్పడింది.
ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయిన సూచికా..?
ఓ ప్రభుత్వంపై ప్రజలు ఇంత పెద్ద ఎత్తున పిటిషన్లు వేస్తున్నారంటే … ఆ ప్రభుత్వంపై వారంతా విశ్వాసం కోల్పోయినట్లే. ప్రభుత్వం అంటే ఓ నమ్మకం . రాజకీయంగా కాకపోయినా ప్రభుత్వానికి పనులు చేస్తే నిధులు వస్తాయన్న నమ్మకం ఉంటుంది. అలాంటి నమ్మకాన్ని ప్రస్తుత ప్రభుత్వం పోగొట్టిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కాంట్రాక్టులు ఇచ్చి పనులు చేయించుకుని బిల్లులు ఎగ్గొట్టడం… కొర్రీలు పెట్టడం.. లాంటి వాటితో అందరూ విసిగిపోయారు. ఇప్పటికే పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. చేసిన వాళ్లు బిల్లుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.