ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆశ్చర్యకరంగా మారాయి. ముగ్గురు కమిషనర్లు ఉండాల్సి ఉంటే ఇద్దరే ఉన్నారు. అందులో ఒకరు రాజీనామా చేశారు. మరొక్కరే ఉన్నారు. రాజీనామా చేసిన గోయల్ ఏమీ సుద్దపూసగా కీర్తికెక్కలేదు. ఆయన కూడా ప్రభుత్వ పెద్దల సన్నిహితుడే. అయినా ఎందుకు చేశారు ?
ఎన్నికలసంఘం లో సీఈసీతో మిగిలిన కమిషనర్‌కు సరిపడలేదని మీడియా వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇటీవల బెంగాల్లో ఎన్నికల ఏర్పాట్ల సమీక్షించిన సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొనేందుకు గోయల్ నిరాకరించారు. తర్వతా ఢిల్లీకి వెళ్లి రాజీనామా సమర్పించారు. అంతకు ముందే.. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు విషయమంతా తెలియడంతో… ఎక్కువగా నచ్చచెప్పకుండా రాజీనామా నిర్ణయాన్ని ఆమోదించేశారు. ఇద్దరు అధికారుల మధ్య ఏం జరిగింది? ఆ విభేదాలు ఏమిటి? ఏయే అంశాలపై అభిప్రాయబేధాలు తలెత్తాయి? అనే విషయాలు బయటకు రావడంలేదు.
7న కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన సమావేశాలకు సీఈసీతో పాటు గోయల్ కూడా హాజరయ్యారు. కానీ ఆ మరునాడు ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ అధికారులు, కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా మధ్య జరిగిన సమావేశానికి ఆయన డుమ్మా కొట్టారు. పైగా సీఈసీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను పంపారు. నోటిఫికేషన్ వెలువడే వరకూ సీఈసీకి, ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు తప్ప గోయల్ రాజీనామా గురించి ఎవరికీ తెలియదు.
మరో రెండు, మూడు రోజుల్లో ఇద్దరు కమిషనర్లను నియమించడం ఖాయమే. ఇటీవలే ఎన్నికల అధికారులను కూడా.. కేంద్ర మే నియమించేలా చట్టంచేశారు. అంటే చెప్పినట్లుగా వినే వారినే ఎంపిక చేసుకుంటారు. మరి వారి ఆధ్వర్యంలో ఎెన్నికల నిర్వహణపై ప్రజలు నమ్మకం పెంచుకోగలరా ?