మునుగోడులో ఉపఎన్నిక ఎందుకు వచ్చింది ? ఏడాది మాత్రమే పదవీ కాలం ఉన్న ఎమ్మెల్యే పదవి కోసం ఎందుకు కోట్లు ఖర్చు పెడుతున్నారు ?. అసలు మునుగోడు ప్రజల్నిపార్టీలు ఓట్లు ఏమని అడుగుతాయి ? ఇవన్నీ సందేహాలే. దేనికీ సరైన సమాధానం ఉండదు. కానీ అన్ని పార్టీలు మాత్రం.. ప్రజలకోసమే అంటాయి. మునుగోడు ప్రజల కోసం ఉపఎన్నిక వచ్చిందని చెబుతూంటారు. అసలు ప్రజలకు మాత్రం ఉపఎన్నిక ఎందుకో మాత్రం అర్థం కావడం లేదు.
సాధారణంగా ఉపఎన్నికలు ఓ కారణంతో వస్తాయి. మునుగోడుకు ఉపఎన్నికలు ఏ కారణంతో వచ్చాయన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఏడాది కూడా పదవి కాలం లేని మునుగోడుకు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం ఎందుకు..? మళ్లీ బీజేపీ తరపున పోటీ చేయడం ఎందుకన్నది చాలా మంది ఓటర్లకు అర్థం కాని విషయం. రాజగోపాల్ రెడ్డికి రూ. పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే ఉపఎన్నిక వచ్చిందని టీఆర్ఎస్ అంటోంది. కాంగ్రెస్ .. ఆ రెండు పార్టీలు ఒకటేనని చెబుతోంది.
ఉపఎన్నిక పూర్తిగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి వల్లనే వచ్చింది. నాలుగేళ్లలో చేయని రాజీనామా ఇప్పుడెందుకు చేశారనేది చాలా మందికి వస్తున్న సందేహం. అయితే రాజకీయ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఉపఎన్నిక ఎందుకు అనే అంశాన్ని మర్చిపోయేలా పెద్ద ఎత్తున డబ్బుల వరద పారిస్తున్నాయి. ఎందుకొస్తే ఏమిటి.. తమకు కొంత మొత్తం అందిందా లేదా అనుకునేలా చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రజాస్వామ్యాన్ని రాజకీయ పార్టీలు ఓడిస్తున్నాయి. కేవలం డబ్బు అజెండాగానే ఎన్నికలు జరుగుతున్నాయి.