సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన కోసం లగ్జరీ విమానంలో సతీ సమేతంగా పారిస్ వెళ్లారు. కుమార్తెకు కాన్వొకేషన్లో పాల్గొని తిరిగి వస్తారు వచ్చే నెల మూడో తేదీన తిరిగి వస్తారు. ఇందులో ఎక్కడా అధికారికం అనే ప్రశ్నే లేదు. పూర్తిగా వ్యక్తిగతం. అయితే ఈ పర్యటన ఖర్చుపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. ఎందుకంటే సీఎం జగన్ వెళ్లిన ఫ్లైట్ ఖర్చు గంటకు లక్షల్లోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. మామూలు ఫ్లైట్లో వెళ్లి ఉంటే ఎవరూ పెద్దగా చర్చించేవారు కాదేమో.
ఎలా లేదన్న కనీసం పది కోట్ల వరకూ ప్రస్తుతం సీఎంజగన్ పారిస్ టూర్ వల్ల ఖర్చవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ మొత్తాన్ని ఎవరు పెట్టుకుంటారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. సహజంగా వ్యక్తిగత పర్యటనలకు ప్రజధనాన్ని ఉపయోగించరు. కానీ సీఎం జగన్ తీరు మాత్రం భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రిగా తాను ఒక్క రూపాయే జీతం తీసుకుంటానని చెబుతారు కానీ.. సీఎంగా వచ్చే శాలరీపై కట్టాల్సిన ఆదాయపు పన్ను కూడా ప్రజాసొమ్మునే తీసుకుంటారు. అందుకే జగన్ వ్యక్తిగత పర్యటనలకు కూడా ప్రజాధనమే వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
నిజానికి ఈ విషయంలో విమర్శలు వస్తాయని ముందుగానే తెలుసు కాబట్టి.. అధికారులు కానీ ప్రభుత్వం కానీ..అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మొత్తం వ్యక్తిగత ఖర్చుతోనే వెళ్తున్నారని ప్రకటిస్తే ఇలాంటి సమస్యలు వచ్చేవి కావు. కానీ అలా ప్రకటించలేదంటే ప్రజాధనంతోనే ఆయన లగ్జరీ విమానాలను అద్దెకు తీసుకుని ప్రయాణిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఏపీలో ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ అంశం చర్చకు వస్తోంది.