చిన్నదైనా సొంత ఇంటిలో ఉండాలని చాలా మంది అనుకుంటారు. సొంత ఇల్లు అంటే ఇండిపెండెంట్ హౌస్. అపార్టుమెంట్ కాదని చాలా మంది అభిప్రాయం. కానీ ఇప్పుడు నగర్ వాసులు పూర్తి స్థాయిలో మనసు మార్చుకుంటున్నారు. ఇల్లు అంటే అపార్టుమెంట్ అనుకుంటున్నారు. అపార్టుమెంట్ మాత్రమే కొనాలనుకుంటున్నారు. ఇండిపెండెంట్ హౌస్లపై ఆసక్తి చూపించేవారు తగ్గిపోతున్నారని మార్గెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఓ ఐదేళ్ల కిందటి వరకూ అపార్టుమెంట్స్ అంటే.. ఐదు వందల గజాల స్థలంలో ఐదు అంతస్తుల్లో కట్టే ఇళ్లు. ఇళ్లు అనే మాటే కానీ అది గ్రూప్ హాస్టల్స్ లాగా ఉంటాయి. ఎన్ని సమస్యలు వస్తాయో చెప్పాల్సిన పని లేదు. ఇంటి ముందు చెప్పులు పెట్టుకున్నా పొరుగువారితో సమస్యలు వస్తాయి. ఇక ఇతర మౌలిక సదుపాయాలతో వచ్చే సమస్యలు.. నిర్వహణ బాధ్యతలు అన్నీ కలిసి విరక్తి పుట్టించేవి. అందుకే చిన్నది అయినా ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు.
కానీ ఇప్పుడు అపార్టుమెంట్ల నిర్వచనం మారుతోంది. గేటెడ్ కమ్యూనిటీల్లో ఇల్లు అయినా ఇండిపెండెంట్ హౌస్లతో సమానంగా చూస్తున్నారు. నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఉండే గేటెడ్ కమ్యూనిటీల్లో అపార్టుమెంట్ చాలని అనుకుంటున్నారు. ఇక ధనవంతులు కూడా విలాసవంతమైన కాలనీల్లో బంగళాలను వదిలేసుకుని అలాంటి సౌకర్యాలు ఉంటున్న హై రైజ్ స్కై స్క్రాపర్స్కు మారిపోతున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల విల్లాల నిర్మాణం కన్నా హై రైజ్ టవర్ల నిర్మాణమే ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి అపార్టుమెంట్లకే డిమాండ్ ఎక్కువ ఉందని అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ధర కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ చాలా కాస్ట్ లీ వ్యవహారంగా మారింది.