తెలంగాణలో రాజకీయాలు రాను రాను ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఎవరు వెళ్లినా అడ్డుకోవడం అనే ఓ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన నియోజకవర్గంలోని గ్రామాల పర్యటనకు వెళ్తే పసుపురైతుల పేరుతో టీఆర్ఎస్ కార్యకర్తలు గందరగోళం సృష్టించారు. ఆయనపై దాడికి దిగారు. కారును ధ్వంసం చేశారు. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం వారు పసుపు రైతలని.. టీఆర్ఎస్ కాదని అంటున్నారు. పసుపుబోర్డు తెస్తానని ఎన్నికల్లో మాటిచ్చి మోసం చేసినందునరైతులు దాడిచేశారని అంటున్నారు.
నిజానికి ఇలా అడ్డుకోవడం అనేది బీజేపీ నేతలు కొంత కాలం నుంచి చేస్తన్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రులు కూడా ఎక్కడైనా పర్యటనకు వెళ్తే బీజేపీ నేతలు.. కార్యకర్తలు అడ్డం పడటాన్ని ఓ అలవాటుగా చేసుకున్నారు. ఇదో రాజకీయ పోరాటంగా మారిపోయింది. “అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు.. పోలీసుల లాఠీచార్జ్” అనేది కామ్ అయిపోయింది. దానికి ప్రతిఫలంగా ఇప్పుడు టీఆర్ఎస్ కూడా బీజేపీ వాళ్లను అడ్డుకుంటామని చేతలతోనే చెబుతోంది.
తెలంగాణలో రాజకీయ అసహనం పెరిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అటు అధికార పక్షం.. ఇటు విపక్షం ఎవరికి వారు పోటాపోటీగా గీతలు దాటి విమర్శలు చేసుకోవడం.. ఆ తర్వాత దాడులకు తెగబడటం కామన్ అయిపోయింది. అధికార పార్టీ ఇటీవల అరెస్టులకు సైతం వెనుకాడటం లేదు. తీన్మార్ మల్లన్న అరెస్ట్ తర్వాత బీజేపీ ముఖ్యులనూ అరెస్ట్ చేశారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా శత్రువులుగా చూసుకోవడం ప్రారంభించారు.
తెలంగాణలో రాజకీయంగా అన్ని పార్టీలకూ ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది. ప్రజల్ని మెప్పించడం కన్నా… ఆధిపత్యం కోసం ప్రయత్నించడమే రాజకీయం అన్నట్లుగా ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణలో మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయన్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది.