ఏపీలో జగనన్న స్వర్ణోత్సవ సంబరాల పేరిట కొద్ది రోజులుగా పండగ చేస్తున్నారు. ప్రతీ పథకానికి జగనన్న అని పెడుతున్నట్లుగా.. దీనికి కూడా పెట్టారని అనుకున్నారు. అసలు స్వర్ణోత్సవం దేనికి ? ఏ సంస్థది ? అనే డౌట్ చాలా మందికి వచ్చింది. కానీ అసలు విషయం విషయం ఏమిటంటే.. ఇక్కడ స్వర్ణోత్సవం జగనన్నదే. అంటే.. జగన్‌దే. ఆయనకు స్వర్ణోత్సవం జరుగుతోందన్నమాట.
జగన్ కు డిసెంబర్‌తో యాభై ఏళ్లు నిండుతాయి. ఆది అసలు విషయం. ఇందు కోసం రెండు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని.. సాంస్కృతిక శాఖకు కేటాయించారు. దాంతో ఖర్చులు పెట్టి జగన్ భజనలు ప్రారంభించారు. ఇందులో మంత్రి రోజా డాన్సులు అదనపు ఆకర్షణ అనుకోవాలి. సీఎం జగన్ పుట్టి రోజు కోసం రూ. రెండు కోట్ల ప్రజాధనం వెచ్చించి ముందస్తు వేడుకలు నిర్వహిస్తున్నారన్నమాట.
ప్రస్తుతం ఏపీలో ప్రజాధనాన్ని వైసీపీ, జగన్ కోసం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఉద్యోగుల జీతాల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. కానీ సలహాదారుల నియామకాలు.. సాక్షికి ప్రకటనలు.. సాక్షి సిబ్బందికి ఔట్ సోర్సింగ్ పేరుతో జీతాలు.. వైసీపీ గడప గడపకూ నిధులు.. జగన్ పర్యటనల పరదాల ఖర్చులు.. చివరికి ఇలా జగన్ పుట్టిన రోజు వేడుకలకూ ఖర్చు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రజా ధనమే. మొత్తంగా ప్రజల సొమ్ము అంటే.. తమ సొంతానికి ఖర్చు పెట్టుకోవచ్చన్నట్లుగా పాలన చేస్తున్నారు. మరో వైపు పెండింగ్ బిల్లులు అడిగేవారు ఎక్కడ దాడి చేస్తారోనని అధికారులు సచివాలయలో పోలీసు భద్రత ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి.