కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా అనే ఓ ప్రోగ్రాం పెట్టింది. దాని ప్రకారం కింది స్థాయిలో ఆటల్లో ప్రతిభ ఉన్న వారిని వెలికి తీయాలని నిర్ణయించుకుంది. కేంద్రానికి ప్రత్యేకంగా భూభాగం ఉండదు.. రాష్ట్రాల్లోనే చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే చేయాలి. అలా ఏపీకి కూడా ఇలా కింది స్థాయిలో ఆటగాళ్లను గుర్తించే కార్యక్రమం చేపట్టాలని చెప్పింది. కొంత నిధులు మంజూరు చేసింది. ఏ కేంద్ర పథకం అయినా కేంద్ర, రాష్ట్రాల నిధులతో నిర్వహిస్తూ ఉంటారు. ఇదీ అంతే.
తెలంగాణ ప్రభుత్వం ఈ నిధుల్ని వాడుకుని ప్రతి ఊరిలో చిన్నదో .. పెద్దదో గ్రౌండ్లను రెడీ చేసుకున్నారు . అక్కడ అన్ని రకల ఆటల శిక్షణలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో ఖేలో ఇండియా పేరు మార్చేసి ఆడుదాం ఆంధ్రా అని పేరు పెట్టారు. వైసీపీ ప్రచార కార్యక్రమంగా మార్చేశారు. వైసీపీ ఏదో టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లుగా వైసీపీ రంగులు.. జగన్ రెడ్డి ఫోటోలతో మొత్తం సామాగ్రి రెడీ చేశారు. ఎవరు చూసినా అది ప్రభుత్వ కార్యక్రమం అనుకోరు. జగన్ రెడ్డి కూడా అనుకోవడం లేదు. అందుకే పార్టీ సమావేశంలో అది పార్టీ కార్యక్రమంగానే ప్రకటించారు. కానీ ప్రజల డబ్బుతో చేస్తున్నారు.
ఇప్పటికే వైసీపీ ప్రచారం కోసం చేస్తున్న గడప గడపకూ మన ప్రభుత్వం… వై ఏపీ నీడ్స్ జగన్ వంటి కార్యక్రమాలు ప్రజల డబ్బుతోనే.. అధికారులతో చేస్తున్నారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్రా కూడా అదే కోవలోకి చేరిపోయింది. పార్టీ నిర్వహణకు .. పార్టీ ప్రచారానికి పూర్తి స్థాయిలో ప్రజాధనం వాడేసుకుంటున్న జగన్ రెడ్డి తీరు చూసి… అధికారులు గుల్ల అయిపోతున్నారు. ఏమైనా వ్యతిరేకిస్తే సీఐడీ కేసులు వస్తాయని… నోర్మూసుకుని ఉంటున్నారు.